Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఖాళీ..! కోటంరెడ్డి వెంటే పలువురు నేతలు

ABN , First Publish Date - 2023-02-04T16:39:33+05:30 IST

ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. వీరావేశంతో వీరు పనిచేయకుంటే పార్టీ పునాదులే కదిలిపోతాయి.

Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఖాళీ..! కోటంరెడ్డి వెంటే పలువురు నేతలు

నెల్లూరు: ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. వీరావేశంతో వీరు పనిచేయకుంటే పార్టీ పునాదులే కదిలిపోతాయి. 2019 ఎన్నికల నాటికి అలాంటి నాయకులే వైసీపీకి పెద్ద సంఖ్యలో ఉన్నారు. సీఎం జగన్‌ (CM Jagan)‌ను భుజానికి ఎత్తుకుని, పార్టీ గెలుపునకు కృషి చేశారు. కానీ.. ఇప్పుడు అంతా తలకిందులు. జగన్‌ మీద పెట్టుకున్న భ్రమలు వీడిపోయాయి. జగనన్న అధికారం కేవలం ముగ్గురు, నలుగురికి తప్ప సామాన్యుల అక్కరకు రాదనే సత్యం బోధపడింది కాబోలు తిరుగుబాట్లు మొదలయ్యాయి. జిల్లాలో మొదట వైసీపీ ప్రభుత్వంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామానారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) అసంతృప్తి చేశారు. ఆ పరంపరలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ఏకంగా తిరుగుబాటే చేస్తున్నారు. కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ‘మా నేత కోటంరెడ్డితోనే మా పయనం’ అని నెల్లూరు కార్పోరేషన్ (Nellore Corporation) మేయర్ స్రవంతి, పలువురు కార్పొరేటర్లు స్పష్టం చేస్తున్నారు. కోటంరెడ్డికి వైసీపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ (Nellore Rural Constituency) పరిధిలో కార్పొరేషన్‌ మేయరు సహా 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సర్పంచులు 16 మంది, కమ్యూనిస్టులు మరో ఇద్దరు ఉన్నారు. 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఏఎంసీ చైర్మన్‌ సహా నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారు, మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అందరూ వైసీపీ వారే. ఇది మూడు రోజులకు మునుపటి మాట. ఇప్పుడు వీరంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్గమే. ఫోన్‌ ట్యాపింగ్‌లో విషయంలో కలత చెంది వైసీపీని వీడుతున్నానని శ్రీధర్‌రెడ్డి ప్రకటించిన వెంటనే వీరంతా ఈయనకు మద్దతు ప్రకటించారు. వీరితోపాటు వివిధ సామాజిక వర్గాల వారూ కోటంరెడ్డికి పెద్ద సంఘీభావం వ్యక్తం చేశారు. ఒక్కమాటలో నాలుగు రోజుల క్రితం వరకు నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలిచే మొదటి స్థానం అనుకున్న రూరల్‌ నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులయ్యింది. బలంగా కనిపించిన నియోజకవర్గంలో నిలదొక్కుకోవడానికి ఊతం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

రెండుగా చీలిన సిటీ నెల్లూరు నియోజకవర్గం

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే అనిల్‌కు వ్యతిరేకంగా డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాథ్‌కు ఎమ్మెల్యేకి మధ్య పూడ్చలేని దూరం ఏర్పడింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవీ రామిరెడ్డి ఎమ్మెల్యేకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రూప్‌కుమార్‌, ముక్కాల ద్వారకనాథ్‌, వైవీ రామిరెడ్డి, కొంతమంది కార్పొరేటర్లు ఒక వర్గంగా ఉంటూ అనిల్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వర్గపోరు నేపథ్యంలో క్యాడర్‌ రెండు వర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు దాడి చేసుకొంటున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి.

Updated Date - 2023-02-04T16:39:35+05:30 IST