యువత మేలుకో..!
ABN , First Publish Date - 2023-12-03T00:36:23+05:30 IST
యువత మేలుకో..!
ప్రత్యేక ఓటరు నమోదుకు నేడు ఆఖరు
ఈ నెల 9 వరకు ఆన్‌లైన్‌లో ఎంట్రీకి అవకాశం
తహసీల్దారు కార్యాలయాల్లోనూ దరఖాస్తుకు అవకాశం
పలు గ్రామాల్లో డుమ్మా కొట్టిన బీఎల్వోలు
రాబోయే ఎన్నికల్లో ఓటు లేదని, నచ్చిన అభ్యర్థికి ఓటు వేయలేకపోయానని బాధపడితే ప్రయోజనం ఉండదు. ఓటరు జాబితాలో పేరు లేదా..? ఓటు నమోదుకు అర్హత ఉందా..? ఇంకెందుకు ఆలస్యం.. పోలింగ్ కేంద్రం వైపు అడుగులు వేయండి... ఫారం-6 దరఖాస్తును బీఎల్‌ఓకు అందజేయండి. ప్రత్యేక ఓటరు నమోదు దినోత్సవం (స్పెషల్ క్యాంపెయిన్ డే) ఆదివారంతో ముగుస్తుంది. అయితే ఆన్‌లైన్‌తోపాటు తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసేందుకు ఈ నెల 9వ తేదీ వరకు అవకాశం ఉంది. ఫారం-6 దరఖాస్తు పూరించి రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే వజ్రాయుధాన్ని పొందండి.
కర్నూలు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా పాణ్యం నియోజకవర్గంలో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అక్టోబరు 27 నుంచి డిసెంబరు 9 వరకు స్పెషల్ సమ్మరీకి శ్రీకారం చుట్టారు. నవంబరు 4,5 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ రెండు రోజుల్లో 2,186 పోలింగ్ కేంద్రాల పరిఽధిలో ఓటు నమోదు కోసం ఫారం-6 దరఖాస్తులు కేవలం 8,636 మాత్రమే వచ్చాయి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అదే క్రమంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తొలిరోజు ఓటు నమోదు చేసుకునేందుకు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. పలు పోలింగ్ కేంద్రాల్లోని పరిస్థితిని ఓసారి గమనిస్తే...
కర్నూలు నగరం లేబర్ కాలనీలో కోట్ల విజయభాస్కరరెడ్డి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్-2024లో భాగంగా రెండవ విడత ప్రత్యేక ఓటర్ల నమోదు దినోత్సవం తొలి రోజు శనివారం 9 మంది బీఎల్వోలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్నారు. ఓటు నమోదు కోసం ఫాం-6 దరఖాస్తులు కేవలం 50 మాత్రమే వచ్చాయి. అంటే ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 5-6 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఫాం-7 దరఖాస్తులు 3, మార్పు చేర్పుల కోసం ఫారం-8 దరఖాస్తులు 80 వచ్చాయి.
ఎమ్మిగనూరు పట్టణం వీవర్స్ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఫాం-6 దరఖాస్తులు 19, ఫాం-7 దరఖాస్తులు 15, ఫాం-8 దరఖాస్తులు 15 వచ్చాయి. ఎస్‌ఎన్‌ఎస్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం-151 నుంచి 157 వరకు 7వ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఫాం-6 కోసం 13, ఫాం -7 కింద 7, ఫాం-8 దరఖాస్తులు నాలుగుదాకా వచ్చాయి.
ఆదోని పట్టణంలో ఓటు నమోదు కోసం ఫారం-6 దరఖాస్తులు పోలింగ్ కేంద్రం-232లో 10, పోలింగ్ బూత్-234లో ఒకరు, పోలింగ్ బూత్-256లో ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేశారు. జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి. ఒక్కో పోలింగ్ బూత్‌లో సగటున రెండు మూడుకు మించి ఫారం-6 దరఖాస్తులు రాలేదని తెలుస్తోంది.
అందుబాటులో లేని బీఎల్వోలు
కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల యంత్రాంగం స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడితే పలు గ్రామాలోబీ బీఎల్వోలు(బూత్‌లెవల్ ఆఫీసర్లు) అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. శనివారం ప్రత్యేక ఓటర్లు నమోదులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్వోలు సంబంధిత పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హోళగుందలో 14 పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒకరిద్దరు మినహా మిగితా బీఎల్వోలు అందుబాటులో లేరని స్థానికులు తెలిపారు. 44వ పోలింగ్ కేంద్రంలో ఓటు నమోదు కోసం వచ్చిన వారి నుంచి ఫాం-6 దరఖాస్తులు తీసుకోకుండా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఫొటోలు తీసుకొని పంపించారు. మంత్రాలయం మండలం మాధవరంలో 50, 51, 52 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో లేరు. 52వ పోలింగ్ కేంద్రం బీఎల్వో వచ్చి కొంత సమయం ఉండి వెళ్లిపోయారు. కర్ణాటక సరిహద్దు మండలాల్లో అనేక గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఉదయం హాజరైనట్లు సెల్ఫీ ఫొటోలు తహసీల్దార్లకు పంపించి ఇళ్లకు వెళ్లిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి, చనిపోయిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యం నీరుగారుతోంది. జిల్లా యంత్రాంగం స్పందించి నేడు (ఆదివారం) 2,186 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
స్పెషల్ క్యాంపెయిన్ డే.. నేడు ఆఖరు
ప్రత్యేక ఓటర్ల నమోదు (స్పషల్ క్యాంపెయిన్ డే)కు ఆదివారం లాస్ట్‌చాన్స్. అర్హత కలిగిన యువత ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు నమోదు కోసం ఫాం-6 దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు, ఆఫ్‌లైన్‌లో తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసేందుకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు పేర్కొన్నారు.