పనులు మీకు.. పైసలు మాకు!

ABN , First Publish Date - 2023-03-30T23:53:50+05:30 IST

‘ఎల్లెల్సీ సీసీ లైనింగ్‌ పనులు కావాలా..? అయితే మాకు 5 శాతం వాటా ఇవ్వాల్సిందే. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. మాకు ఖర్చులు ఉన్నాయి’

పనులు మీకు.. పైసలు మాకు!

రూ.400 కోట్లతో టీబీపీ ఎల్లెల్సీ, హెచ్చెల్సీ ఆధునికీకరణ

5 శాతం వాటా ఇస్తేనే పనులు

ఓ మంత్రి, ఎమ్మెల్యే డిమాండ్‌

గత ఏడాది పనులకు 3 శాతం వాటా చెల్లించినా బిల్లులు లేవు

అంత ఇచ్చుకోలేమంటున్న కాంట్రాక్టర్లు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి):

‘ఎల్లెల్సీ సీసీ లైనింగ్‌ పనులు కావాలా..? అయితే మాకు 5 శాతం వాటా ఇవ్వాల్సిందే. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. మాకు ఖర్చులు ఉన్నాయి’ ఇదీ రాయలసీమకు చెందిన ఓ మంత్రి, జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్‌. లేదంటే తప్పుకోండి.. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్ట్‌ సంస్థ పనులు చేస్తుందని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారం అండతో ఏకంగా రూ.20 కోట్లకు టెండరు పెట్టిన వైనం ఇది. అయితే.. ‘గత ఏడాది చేసిన పనులు ఇచ్చినందుకు 3 శాతం వాటా చెల్లించాం.. ఆ బిల్లులే ఇప్పటి వరకు రాలేదు. అప్పులు చేసి ఇబ్బందులు పడుతుంటే.. తాజా పనులకు 5 శాతం వాటాలు ఇవ్వమంటే ఎలా? ఎన్నికల తరువాత ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. మంత్రి, ఎమ్మెల్యేలకు వాటాల రూపంలో రూ.కోట్లు ఇచ్చి పనులు చేసినా.. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటి..?’ అని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరో పక్క నిబంధనలు తుంగలోకి తొక్కేసి టీబీపీ బోర్డు అధికారులు రాజకీయ నాయకులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా బడ్జెట్‌ కేటాయింపులకు మించి టెండర్లు పిలవడం విమర్శలకు తావిస్తోంది. తుంగభద్ర ఎల్లెల్సీ ఆర్‌సీసీ లైనింగ్‌ భాగోతమిది.

తుంగభద్ర దిగువ (ఎల్లెల్సీ), ఎగువ (హెచ్చెల్సీ) కాలువల ఆధునికీకరణలో భాగంగా.. కర్నూలు జిల్లా పరిధిలో ఎల్లెల్సీ 205.45 కి.మీ. నుంచి 250 కి.మీ. వరకు ఆర్‌సీసీ లైనింగ్‌ పనులు రూ.300 కోట్లు, హెచ్చెల్సీ పరిధిలో రూ.100 కోట్లు కలిపి రూ.400 కోట్లతో చేపట్టే పనులను 13 ప్యాకేజీలుగా విభజించి ఈ ఏడాది జనవరి 1న టెండర్లు నిర్వహించారు. ఎల్లెల్సీ హగరి అక్విడక్ట్‌ మరమ్మతు పనుల్లో కాంట్రాక్టరు ఒకరికి ప్రయోజనం చేకూర్చేలా జీవో ఎంఎస్‌ నంబరు.65 ప్రకారం జాయింట్‌ వెంచర్‌కు అనుమతి ఇచ్చిన టీబీపీ బోర్డు ఇంజనీర్లు... రూ.400 కోట్లతో చేపట్టిన ఆర్‌సీసీ లైనింగ్‌ పనుల టెండర్లలో నిబంధనలు తుంగలో తొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైదరాబాద్‌కు చెందిన యారో కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ నిర్మాణ సంస్థ ఎమ్‌డీ ఎస్‌ విజయ్‌కుమార్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా... తమకు వాటాలు ఇచ్చే కాంట్రాక్టర్లే పనులు చేయాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికలొస్తున్నాయ్‌.. ఐదు శాతం ఇవ్వాల్సిందే

‘2024 ఏప్రిల్‌లో అసెంబ్లీ సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. ముందస్తు అయితే ఆరు నెలల్లో వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలంటే మాటలా? మాకు ఖర్చులు ఉన్నాయి.. ఇన్నాళ్లూ మీకు సహకరించాం.. ఎల్లెల్సీ పనుల్లో 5 శాతం వాటా ఇచ్చి మాకు సహకరించాల’ని సీమకు చెందిన ఓ మంత్రి, జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ‘రూ.400 కోట్లకు టెండర్లు పిలిచారు. ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నట్లు 5 శాతం వాటా కింద రూ.20 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాదు.. టెండరు అప్రూవల్‌ చేసి అగ్రిమెంట్‌ చేసిన ఇంజనీరింగ్‌ అధికారికి 0.50 శాతం, కార్యాలయ సిబ్బందికి 0.50 శాతం కలిపి ఒక శాతం అంటే రూ.4 కోట్లు చెల్లించాల్సి వస్తుంద’ని బళ్లారికి చెందిన ఓ కాంట్రాక్టరు వాపోయారు. పనులు చేశాక బిల్లుల కోసం కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు 8-10 శాతం చెల్లించాలి. అంటే.. దాదాపు 15 శాతం వాటాలకే సరిపోతుందని అంటున్నారు. ఆ నేతలు చెప్పినట్టు చేస్తే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. నాణ్యతతో పనులు చేసేలా సహకరించాల్సిన ప్రజా ప్రతినిధులు ఎన్నికలు వస్తున్నాయని... రాజకీయంగా ఖర్చులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా వాటాలు అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలని పేరు బయటకు చెప్పని ఓ కాంట్రాక్టరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

ఆ బిల్లులు రాలేదు

గత ఏడాది ఎల్లెల్సీ 115.275 కి.మీ. నుంచి 205.45 కి.మీ. వరకు రూ.519.80 కోట్లతో ఆర్‌సీసీ లైనింగ్‌ పనులు 20 ప్యాకేజీలుగా చేపట్టారు. ఈ పనులకు 3 శాతం వాటాలను కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజాప్రతినిధులకు చెల్లించినట్లు సమాచారం. రూ.285 కోట్లు విలువైన పనులు పూర్తి చేస్తే.. రూ.35 కోట్లు బిల్లులు చెల్లించారని ఓ కాంట్రాక్టరు తెలిపారు. సుమారుగా రూ.250 కోట్ల మేరకు బిల్లు బకాయిలు రావాల్సి ఉంది. వీటిని ఏప్రిల్‌ 15న మిగులు నిధుల నుంచి విడుదల చేయిస్తామని అంటున్నారు. అందులోనూ వాటాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆర్థిక సంవత్సరం చివర్లో మిగులు బడ్జెట్‌ ఉంటుందని.. ప్రారంభంలో మిగులు నిధులు ఎలా ఉంటాయని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. వాటాల కోసమే మాయ చేస్తున్నారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నేతల ఆర్థిక ప్రయోజనాల కోసమేనా..?

ఓ వ్యక్తి ఇల్లు కట్టడానికి రూ.25 లక్షలు అవుతుందని అంచనా వేస్తే.. తన వద్ద కనీసం రూ.20 లక్షలు ఉంటేనే ముందుకు వెళ్తారు. మరో రూ.5 లక్షలు అప్పు చేసి ఆ తరువాత తీర్చుకోవచ్చులే అని దైర్యం చేస్తాడు. ఇది సహజ ధర్మం. తుంగభద్ర బోర్డు అధికారులు సహజ ఆర్థిక సూత్రాలు, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ముఖ్య నాయకులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు ఇష్టారాజ్యంగా టెండర్లు పిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది రూ.519 కోట్లకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది రూ.400 కోట్లకు టెండర్లు పిలిచారు. అంటే.. రూ.919 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఈ ఏడాది 2023-24 బడ్జెట్‌లో టీబీపీ ఎల్లెల్సీకి రూ.75 కోట్లు. హెచ్చెల్సీకి రూ.50 కోట్లు కలిపి రూ.125 కోట్లు కేటాయించారు. అందులో ఇంజనీర్లు, సిబ్బంది జీతాలకు రూ.25 కోట్లు పోను మిగిలేది రూ.100 కోట్లే. ఏకంగా రెండేళ్లలో రూ.915 కోట్లకు టెండర్లు పిలవడం వెనుక ఆంతర్యమేమిటి.? అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. పర్సెంటేజీలు, రాజకీయ నాయకుల వాటాల కోసమే బడ్జెట్‌ కేటాయింపులు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీబీపీ బోర్డు ఎస్‌ఈ ఆర్‌. శ్రీకాంత్‌రెడ్డి వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.

Updated Date - 2023-03-30T23:53:50+05:30 IST