ప్రజల కోసం పనిచేయాల్సిందే..

ABN , First Publish Date - 2023-06-07T00:03:30+05:30 IST

ఓటువేసి గెలిపించినందుకు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి కోసం కృషి చేసే బాధ్యత సర్పంచులదే అని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

   ప్రజల కోసం పనిచేయాల్సిందే..
తుగ్గలిలో సర్పంచ్‌ దంపతులకు సన్మానం చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

ప్రభుత్వానికి సమస్యలు పట్టవు

తుగ్గలి సర్పంచను సత్కరించిన జేసీ పభాకర్‌రెడ్డి

తుగ్గలి, జూన్‌ 6: ఓటువేసి గెలిపించినందుకు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి కోసం కృషి చేసే బాధ్యత సర్పంచులదే అని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుద్దిలేని ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోయినప్పటికీ అప్పులు చేసైనా సరే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ‘దారి మళ్లిన నిధులు.. దళిత సర్పంచ్‌ కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు. తాడిపత్రి నుంచి తుగ్గలికి చేరుకుని మురికి కాలువలను శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచిన సర్పంచ్‌ సుంకి రామాంజనేయులు, భార్య లక్ష్మిదేవిలకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి సర్పంచ్‌ పరిస్థితి ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సర్పంచులను కార్మికులుగా పనిచేసే దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. సర్పంచ్‌ కష్టాలను పట్టించుకోవడం లేదని గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, గెలిచి రెండేళ్లు పూర్తి అయినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడమే కాకుండా సొంత డబ్బుతో చేసిన పనులు కూడా బిల్లులు అందించడం లేదన్నారు. గ్రామాలనే విస్మరించిన ఈ ప్రభుత్వాలు రాషా్ట్రన్ని ఏం అభివృద్ధి చేస్తుందన్నారు. సర్పంచులంతా ఓపిక పట్టి గ్రామంలో పనులు చేయాలని లేకపోతే తుగ్గలి సర్పంచ్‌ లాగే ప్రతి సర్పంచ్‌ పారిశుధ్య కార్మికుల అవతారం ఎత్తాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, మాజీ జడ్పీటీసీ వరలక్ష్మి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:03:30+05:30 IST