ఎదురుచూపులే..!
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:01 AM
ఒకటి కాదు.. రెండు కాదు.. 11 గ్రామాల ప్రజల సమస్య. కొన్నేళ్లుగా తాగునీటి కోసం జనాల ఘోష.
అటకెక్కిన మల్టీవిలేజస్ స్కీం పనులు
టీడీపీ హయాంలో 13.50 కోట్లు విడుదల
వైసీపీ వచ్చాక నిలిచిపోయిన నిర్మాణాలు
నిధులు పెంచామని చెబుతున్నా అతీగతి లేదు
11 గ్రామాలకు తప్పని తాగునీటి ఇక్కట్లు
గోనెగండ్ల, డిసెంబరు 22: ఒకటి కాదు.. రెండు కాదు.. 11 గ్రామాల ప్రజల సమస్య. కొన్నేళ్లుగా తాగునీటి కోసం జనాల ఘోష. వీరి కంఠశోష తెలుసుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017లో మల్టీవిలేజస్ స్కీం పథకాన్ని తీసుకొచ్చింది. సమస్యను తీర్చడానికి 13.50 కోట్లు విడుదల చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో తాగునీటి సమస్య తీరినట్టేనని ఆయా గ్రామాల ప్రజలంతా సంతోషించారు. అయితే పనులు సగంలో ఉండగానే 2019లో ఎన్నికలొచ్చాయి. వైసీపీ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఆ పనులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. నిధులు పెంచి పనులను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం చెప్పినా ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో జనాలకు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి.
గోనెగండ్ల మండల పరిఽధిలోని 11 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మల్టీవిలేజస్ స్కీం కింద 13.50 కోట్లు విడుదల చేసింది. ఈ పనులను 2017 ఏప్రిల్‌లో అప్పటి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. 2017 డిసెంబరు నాటి నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం కింద హెచ్ కైరవాడి, గాజులదిన్నె, పుట్టపాశం, పెద్దనేలటూరు, ఎర్రబాడు గ్రామాల్లో ఓహెచ్‌ఆర్ ట్యాంక్‌ల పనులు చేపట్టారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారలోకి రావటంతో ఈ పథకానికి సంబంధించిన పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి.
నిధులు పెంచినా ప్రారంభం కాని పనులు
మల్లీవిలేజస్ స్కీంకు జగన్ ప్రభుత్వం నిధులు పెంచి చెప్పి సరిగ్గా ఈ ఏడాది డిసెంబరుకు ఏడాది అయింది. ఇంతవరకు టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. జగన్ ప్రభుత్వం ఒట్టి మాటలతో కాలయాపన చేస్తోందని గ్రామాస్థులు విమర్శిస్తున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017 జనవరిలో రూ.13.50 కోట్లు విడుదల చేసింది. అయితే అప్పట్లో ఎన్నిల సమయం దగ్గర పడటంతో పనులు కొంత మందగించాయి. అనంతరం వైసీపీ ప్రభుత్వం రావడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రూ.13.50 కోట్లను కలుపుకొని కొత్తగా రూ.19.50 కోట్లకు పెంచి నిధులు విడుదల చేసినట్లు గత ఏడాది నుంచి అధికారులు, నాయకులు ప్రకటనలు చేస్తున్నారే గాని పనుల మాత్రం ప్రారంభం కాలేదు.
పథకం లక్ష్యం
ప్రభుత్వం గోనెగండ్ల మండలంలోని 11 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం మల్టీవిలేజ్ స్కీంను మంజూరు చేసి రూ.13.50 కోట్లను విడుదల చేసింది. మండల పరిధిలోని గాజులదిన్నె హెచ్‌కైరవాడి, ఎర్రబాడు, పుట్టపాశం, కులుమాల, పెద్దమరివీడు, వీరంపల్లి, తిప్పనూరు. నెరుడుప్పల, పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఈ పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకం పూర్తయితే ఈ గ్రామాలకు తాగునీటి సమస్య తీరేది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
టీడీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు పనులు శరవేగంగా సాగాయి. గాజులదిన్నె, పుట్టపాశం, హెచ్‌కైరవాడి, కులుమాల గ్రామాల్లో ఓహెచ్‌ఆర్ ట్యాంక్‌ల నిర్మాణ పనులు సాగాయి. అయితే 2019లో ఎన్నికల కోడ్ రావటం కారణంగా పనులలో జాప్యం జరిగింది. ఎన్నికలు ముగిసిన అనంతరం వైసీపీ అధికారంలోకి రావటంతో కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో పడి పనులు నిలిచిపోయాయి. రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదు. 11 గ్రామాల్లో తాగునీటి సమస్య తీరలేదు. ఆయా గ్రామాల ప్రజలు మాత్రం ఈ స్కీం ఎప్పుడు పారంభం అవుతుందా, తాగునీరు ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు.
జీడీపీ దగ్గర స్థలం కేటాయింపు
గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో ఎంవీఎస్ స్కీంకు అప్పటి జనవనరుల శాఖ 75 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఈ ప్రదేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఓవర్‌హెచ్ బ్యాలెన్స్ రిజర్వాయర్, ర్యాపిడ్‌శ్యాండ్ ఫిల్టర్స్‌ను నిర్మించి గాజులదిన్నె ప్రాజెక్టులోని నీటిని బ్యాలెన్స్ రిజర్వాయర్‌లో నీరు నిలువ చేసి గ్రామాలకు సరఫరా చేయాలన్నది పథకం లక్ష్యం. అలాగే వాచ్‌మెన్ గదులను కూడా నిర్మించాల్సి ఉంది.
పథకం పనులు ప్రారంభించాలి
ఎంవీఎస్‌స్కీం పనులను ప్రభుత్వం ప్రారంభించి 11 గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలి. గతంలో దాదాపు సగం వరకు పనులు పూర్తయ్యాయి. మిగత సగం పనులను పూర్తి చేస్తే గ్రామాల్లో తాగునీటి సమస్య తీరుతుంది. వచ్చేది వేసవి కాలం కాడంతో పనులు త్వరితగతిన చేపట్టాలి.
- రామకృష్ణ, తెలుగు యువత జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, గాజులదిన్నె
త్వరలో పనులు చేపడతాం
ఎంవీఎస్‌స్కీంకు సంబంధించిన పనులకు ప్రభుత్వం పాత నిధులకు కలిపి కొత్తగా మరిన్ని నిధులు విడుదల చేసింది. గతలో రూ.13.50 కోట్లు విడుదల చేయగా ప్రస్తుతం ఆ నిధులను కలుపుకొని రూ.19.50 కోట్లకు పెంచింది. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్ కాపీలను ఉన్నతాధికారులకు పంపాం. వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. టెండర్ పనులు పూర్తి కాగానే పనులు ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తాం.
-శ్రీనివాసులు రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గోనెగండ్ల