నోటుపై ఓటు విజయం!

ABN , First Publish Date - 2023-03-19T00:23:58+05:30 IST

డబ్బుతో ఓట్లు కొనవచ్చు.. దౌర్జన్యాలతో ప్రతిపక్షాలను కట్టడి చేయవచ్చు..

    నోటుపై ఓటు విజయం!

పట్టభద్రులకు రూ.1,000-2,000 వేలు పంపిణీ

వలంటీర్లు, గృహ సారథులతో బెదిరింపులు

గ్రాడ్యుయేట్స్‌ నిశ్శబ్దం విప్లవం

జగన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిన యువతరం

టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజయకేతనం

జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

టీడీపీ శ్రేణుల్లో జోష్‌ పెంచిన విజయం

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): డబ్బుతో ఓట్లు కొనవచ్చు.. దౌర్జన్యాలతో ప్రతిపక్షాలను కట్టడి చేయవచ్చు.. అధికారం మాటున అందలం ఎక్కవచ్చు.. ఇదే అధికార వైసీపీ రాజకీయ నీతి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ వ్యూహానికి పదును పెట్టారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పంపిణీ చేశారు. ఓటుతో గెలవచ్చనే వైసీపీ ఎత్తులను పట్టభద్రులు తిప్పికొట్టారు. నాలుగేళ్లు నుంచి ఒక్క జాబ్‌ కేలండరు కూడా ఇవ్వకుండా దగా చేసిన జగన ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్లు ప్రతికారం తీర్చుకున్నారు. యువతరం ఓటేత్తితే ఎంతటి ప్రభుత్వాలైనా తలవంచక తప్పదని నిరూపించారు. వలంటీర్లు, గృహ సారథులు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు రావని హెచ్చరించినా.. వైసీపీ నేతలు బెదిరింపులకు గురి చేసినా పట్టభద్రులైన ఉద్యోగ ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత ఓటు అసా్త్రన్ని సంధించి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించారు. నోటుకు ఓటు అమ్ముకోమని నిరూపించారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగరేయడంతో తెలుగు తమ్ముళ్లు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. పట్టభద్రులు అందించిన విజయం టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపింది.

పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-కర్నూలు) పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో 3,30,124 మంది ఓటర్లు ఉన్నారు. 49 మంది అభ్యర్థులు సంగ్రామంలో సై అన్నారు. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజు మధ్యనే నువ్వా - నేనా అన్నట్లుగా పోరు సాగింది. 13న పోలింగ్‌ జరిగితే 2,44,307 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,16,562 ఓటర్లకు గాను.. 66,254 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్నూలు, నంద్యాల జిల్ల్లాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన 132 పోలింగ్‌ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులకు అనంతపురంలోని జేఎనటీయూలో ఏర్పాటు చేసిన సా్ట్రంగ్‌ రూంకు తరలించి.. 16న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఉత్కంఠంగా రెండున్న రోజులు .. అంటే సుమారు 58 గంటలు ఓట్ల లెక్కింపు సాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి 1,820 ఓట్లతో ఆధిక్యత ఉన్నా.. రెండో ప్రాధ్యానత ఓట్ల లెక్కింపు ఎలిమినేషన ప్రక్రియలో బీజేపీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర, పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లతో 6,500 పైచిలుకు ఓట్లలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఘనవిజయం అందుకున్నారు. ఈ విజయంలో ఉమ్మడి జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తల కృషి ఎంతో ఉంది.

ఫ డబ్బు వలలో పడని పట్టభద్రులు:

డబ్బులు ఇస్తే ఎవరైనా ఓటు వేస్తారు..! అని పట్టభద్రులైన మేధావులను సైతం నోటుతో కొట్టాలని అధికారపార్టీ చూసింది. వాళ్ల చేతుల్లో ఉన్న వలంటీర్లు, గృహ సారథులను పట్టభద్రుల ఓటర్ల జాబితా చేతపట్టుకొని ఇంటింటికి వెళ్లి ఓటర్లను గుర్తించింది. ఆ తరువాత వైసీపీ కీలక కార్యకర్తలు ఓటుకు రూ.వెయ్యి నోటు పంపిణీ చేశారు. ఓటుకు నోటు వద్దంటే ఎక్కడ తమను ఇబ్బందులకు గురి చేస్తారో..! అని గ్రహించిన మేధావులు కాదనకుండా నోటు తీసుకున్నారు. కొందరు మాత్రం తిరస్కరించారు. ముప్పాతిక శాతం పట్టభద్రులు రూ.వెయ్యి నోటు తీసుకోవడంతో తమ గెలుపునకు డోకా లేదన్నారు. పైగా టీడీపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే ప్రచారం చేశారు. పోలింగ్‌ రోజు మధ్యాహ్నం 2 గంటలు తరువాత పోలింగ్‌ కేంద్రాలకు రాని పట్టభద్రులను గుర్తించి వైసీపీ గృహ సారథులు పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి పోలింగ్‌ కేంద్రాలకు రప్పించారు. ఆ సమయంలో ఓటుకు రూ.2-3 వేలు ఇచ్చారనే ప్రచారం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 40.34 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2-4 గంట మధ్య రెండు గంటల్లో 31 శాతం పోలింగ్‌ జరిగింది. దీంతో గెలుపుపై వైసీపీకి మరింతా ధీమా పెరిగింది. అయితే.. పట్టభద్రులైన మేధావులు మాత్రం ఎక్కడా డబ్బు వలలో పడలేదు. నాలుగేళ్ల జగన ప్రభుత్వంలో ఒక్క జాబ్‌ క్యాలెండరు కూడా విడుదల చేయకపోవడం.. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఓట్లు వేయించుకొని మోసం చేయడం.. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకపోవడం.. మొదలైనవన్నీ భరిస్తూ వచ్చిన మేధావులు ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు అసా్త్రన్ని సంధించారు. అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేశారు. నిశ్శబ్దం విప్లవంతో నోటుపై ఓటు విజయం సాధించేలా చేశారు.

ఫ టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపిన పెద్దల సభ సమరం:

బాదుడే.. బాదుడు కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నవంబరు నెలలో జిల్లాలో పర్యటించారు. పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరులు జనం చంద్రబాబు రోడ్‌షో, ర్యాలీ, సభలకు వేనవేలుగా తరలివచ్చి జేజేలు పలికారు. సభలు జనసంద్రమై నిఘా వర్గాలకే అంతుచిక్కని స్థాయిలో సక్సెస్‌ అయ్యాయి. రాష్ట్రంలోనే టీడీపీ శ్రేణుల్లో కర్నూలు చంద్రబాబు పర్యటన నూతన ఉత్తేజం నింపింది. ఆ తరువాత ఎక్కడికి వెళ్లినా జనమే.. జనం... నీరాజనం. ఈ నెల 13న జరిగిన పెద్దల సభ సమరంలో రాయలసీమ పట్టభద్రులు టీడీపీకి భారీ విజయాన్ని అందించారు. ఇది టీడీపీ శ్రేణల్లో జోష్‌ నింపింది. 2024 ఏప్రిల్‌లో రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో విజయానికి నాంది అంటూ టీడీపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఫ సంబరాల్లో తెలుగు తమ్ముళ్లు:

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగి తేలారు. టీడీపీ జిల్లా కార్యాలయం ఆవరణలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు ఇనచార్జి ఆకేపోగు ప్రభాకర్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్‌, టీడీపీ నాయకులు సోమిశెట్టి నవీన తదితరుల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచారు. కార్యకర్తలు నృత్యాలు చేశారు. కర్నూలు టీడీపీ ఇనచార్జి టీజీ భరత ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పత్తికొండతో టీడీపీ సంబరాలను అడ్డుకొని కేసులు పెడుతామని సీఐ బెదిరించినా భయపడకుండా తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా వెళ్లి విజయోత్సవాలు జరుపుకున్నారు. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇనచార్జిలు కోట్ల సుజాతమ్మ, కె. మీనాక్షినాయుడు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, పి. తిక్కారెడ్డి ఆదేశాలు మేరకు తెలుగుతమ్ముళ్లు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు.

Updated Date - 2023-03-19T00:23:58+05:30 IST