ఎమ్మెల్యేకు రెండు చోట్ల ఓటు

ABN , First Publish Date - 2023-08-22T23:59:45+05:30 IST

రెండు చోట్ల ఓటు కలిసి ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి నీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

ఎమ్మెల్యేకు రెండు చోట్ల ఓటు
ఓటరు జాబితాను చూపుతున్న అఖిలప్రియ

ఆళ్లగడ్డ, ఆగస్టు 22: రెండు చోట్ల ఓటు కలిసి ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి నీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని ఆమె స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు పట్టణంలోని 154, ఎర్రగుడి దిన్నెలోని 175 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని ఆరోపించారు. అలాగే వారి బంధువులు కూడా ఈ రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. రెండు చోట్ల ఓటు హక్కు కల్గి ఉండకూడదన్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా? అని ఆమె ప్రశ్నించారు. పైగా తాను చెప్పింది చేస్తానని, ఇతరులు ఏమి చేయలేరని గొప్పలు చెప్పుకోవడానికి అర్థం ఉండాలన్నారు. రెండు చోట్ల ఓట్లు కల్గి ఉండడాన్ని తెలియజేస్తూ ఆర్డీవోకు ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన ఆర్డీవో నోటీసులు జారీ చేస్తామని చెప్పారన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ 12వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిపొందినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ గెలుపు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రతిపక్షాల అభ్యర్థులను భయాందోళనకు గురి చేయడం, డబ్బులు పంచడం వంటి వాటి వల్ల గెలిచారని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఎందుకు డబ్బులు పంచుతున్నారని అడిగారు. కోటకందుకూరు సర్పంచు ఉప ఎన్నికల్లో మీ పాలన నచ్చక మీతో విభేదించి రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేశారన్న విషయాన్ని గుర్తుచేసుకోవాల న్నారు. బ్రాహ్మణపల్లెలో వైసీపీలోని రెండు వర్గాలు పోటీ పడితే ఒక వర్గానికి ఒక ఓటు వచ్చిందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లాగానే ఎమ్మెల్యే ఎన్నికలు ఉంటాయనుకోవద్దని సూచించారు. కోటకందుకూరులో రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, సీఎం జగన్‌ ఆళ్లగడ్డకు వచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. అయితే ఏడాది గడిచినా ఇంతవరకు ఆ నిధుల గురించి ఊసే లేదన్నారు.

Updated Date - 2023-08-22T23:59:45+05:30 IST