ఆడిట్‌ శాఖలో ఆగిన బదిలీ ప్రక్రియ

ABN , First Publish Date - 2023-06-02T23:51:14+05:30 IST

రాష్ట్ర అడిట్‌ శాఖ కర్నూలు రీజియన్‌లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ శుక్రవారానికి కూడా కొలిక్కి రాలేదు.

ఆడిట్‌ శాఖలో ఆగిన బదిలీ ప్రక్రియ

జీవోకు వ్యతిరేకంగా బదిలీలు చేయాలని ఒత్తిళ్లు

తర్జన భర్జనలో జిల్లా అధికారి

కర్నూలు(అర్బన్‌), జూన్‌ 2: రాష్ట్ర అడిట్‌ శాఖ కర్నూలు రీజియన్‌లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ శుక్రవారానికి కూడా కొలిక్కి రాలేదు. మే 30లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆడిట్‌ శాఖలో మాత్రం మిగిలిన రీజియన్లలో బదిలీలు పూర్తయినా కర్నూలు రీజియన్‌లో పెండింగ్‌ పడటంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రీజనల్‌ అధికారులు బదిలీలకు అర్హులైన వారి జాబితా సిద్ధం చేసినా రాష్ట్ర స్థాయిలో ఓ అధికారి అడ్డుపడుతున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి మే 30లోగా బదిలీలు పూర్తి కావాల్సి ఉందని, జూన్‌ రెండో తేదీ రాత్రికి కూడా ప్రకటించకపోవడంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఆడిట్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. జీవోకు విరుద్ధంగా రెండేళ్లలోపు వారిని సైతం బదిలీ చేయాలని జిల్లా అధికారిపై రాష్ట్ర స్థాయి అధికారి ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే జిల్లా అధికారులు బదిలీలపై తర్జనభర్జనలో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2023-06-02T23:51:14+05:30 IST