నేడు గణేశ్ నిమజ్జనం
ABN , First Publish Date - 2023-09-26T00:33:18+05:30 IST
కర్నూలు నగరంలో తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు మంగళవారం ఇక సెలవంటూ గంగ ఒడికి చేరనున్నాడు.

ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
కర్నూలు/కర్నూలు కల్చరల్, సెప్టెంబరు 25: కర్నూలు నగరంలో తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు మంగళవారం ఇక సెలవంటూ గంగ ఒడికి చేరనున్నాడు. నగరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలను నగర నడిబొడ్డున గల కేసీ కెనాల్ ఒడ్డున వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లను కలెక్టర్ జి.సృజన, ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ, గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు పరిశీలించారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా నగరంలో ముఖ్య ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ వాహనాలు, అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ సృజన తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు పాతనగరంలోని రాంభొట్ల దేవాలయం వద్ద నగరంలోని తొలి గణేశ్ మంటపం వద్ద పూజలతో నిమజ్జనోత్సవం ప్రారంభమవుతుంది. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై పోలీస్ ఉన్నతాధికారులతో ఎస్పీ కృష్ణకాంత్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమై దిశానిర్దేశం చేశారు.