ఈ ఏడాది ఇంతేనా..!

ABN , First Publish Date - 2023-03-30T23:49:54+05:30 IST

నంద్యాల మెడికల్‌ కాలేజీని పూర్తి చేస్తే జిల్లా మొత్తాన్నీ అభివృద్ధి చేసినట్లే అన్నట్లు అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారు.

ఈ ఏడాది ఇంతేనా..!

పూర్తి కాని వైద్య కళాశాల పనులు

సకాలంలో నిర్మాణం పూర్తి కాకపోతే అనుమతులు అనుమానమే

150 సీట్లకు ఎసరు

నంద్యాల, ఆంధ్రజ్యోతి:

నంద్యాల మెడికల్‌ కాలేజీని పూర్తి చేస్తే జిల్లా మొత్తాన్నీ అభివృద్ధి చేసినట్లే అన్నట్లు అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అంత ప్రగల్బాలు పలికిన వారు మెడికల్‌ కాలేజీ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. దీంతో మెడికల్‌ కాలేజీ ఒక విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ నెలాఖరులోపు నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే మెడికల్‌ కాలేజీకి అనుమతులు ఇచ్చేది లేదని ఎన్‌ఎంసీ (నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌) తేల్చి చెప్పింది. దీనివల్ల 150 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ వహించి కళాశాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి.

నంద్యాల మెడికల్‌ కాలేజీ నిర్మాణాన్ని ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూముల్లో చేపట్టారు. తరగతులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, హాస్టల్‌ భవనాలు నిర్మాణ దశ లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసేందుకు రూ.450 కోట్లు అవసరం. ఇప్పటికి రూ.60 కోట్లకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కనీసం మొదటి సంవత్సరం విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు, బోధన వైద్యుల కోసం గదులు అయినా కావాలి. ఇవి పూర్తయితే ఎన్‌ఎంసీ అధికారులకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటిలో కేవలం 70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 30 శాతం పనులను వచ్చే నెలాఖరుకి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. అసలు ఇప్పటి వరకు జరిగిన పనులను అంచనా వేస్తే నెలకు 12 శాతం చొప్పున మాత్రమే పనులు జరిగాయి. మరి మిగతావి కేవలం నెల వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

వచ్చే నెలలో మరోసారి..

మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నదీ తెలుసుకునేందుకు ఎన్‌ఎంసీ అధికారులు ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాకు వచ్చారు. నిర్మాణ పనులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఫిబ్రవరి చివరి వారంలో అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. పనుల జాప్యంపైన, ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై వివరణ ఇవ్వాలని కోరారు. దీనికి అధికారులు స్పందిస్తూ ఏప్రిల్‌ నెలాఖరుకల్లా కాలేజీ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని జవాబిచ్చారు. దీని ప్రకారం వచ్చే నెల ఎన్‌ఎంసీ అధికారులు మళ్లీ ఓసారి వచ్చి నిర్మాణాలు పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేస్తే గాని మెడికల్‌ కాలేజీకి అనుమతి వచ్చే అవకాశం లేదు. అయితే గతేడాది వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సీటీకి చెందిన కమిటీ జిల్లాకు వచ్చి నిర్మాణ పనులు పరిశీలించి వెళ్లినట్లు మెడికల్‌ కాలేజీకి చెందిన వైద్యులు చెబుతున్నారు. కాలేజీ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయకపోతే ఎదుర్కోవాల్సిన పరిణామాల గురించి జిల్లా యంత్రాంగానికి, అధికారులకు కమిటీ తెలుపలేదా? లేక వారి మాటలను ఇక్కడి అధికారులు పెడచెవిన పెట్టారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. మొత్తానికి నంద్యాల మెడికల్‌ కాలేజీ భవితవ్యం ఏమయ్యేదీ మరో నెలలో తేలబోతోంది.

ఇలా అయితే..

మెడికల్‌ కాలేజ పూర్తయితే దాదాపు మొదటి సంవత్సరం 150 సీట్లలో విద్యార్థులు చేరుతారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణం అనుకున్నట్లు సకాలంలో జరగకపోతే ఈ విద్యాసంవత్సరం వృథా అయినట్లే. 150 మంది విద్యార్థులకు మెడిసిన్‌ చదివే అవకాశం ఉండదు. మెడికల్‌ కాలేజీ ప్రారంభానికి ముందే ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరమవుతారు. ఇప్పటికే వీరిని ప్రభుత్వం నియమించింది. వీరి బోధన సేవలు కూడా వృఽథా అవుతాయి. కాలేజీ మొదలైతే ల్యాబ్‌ అసిస్టెంట్లు, నర్సులు వంటి వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి. అవీ ఏడాదిపాటు ఉండవు.

వాటికి చోటు లేక..

వైద్య విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. అయితే కాలేజీ భవన నిర్మాణాలు ఓ కొలిక్కి రాకపోవడంతో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వాటిని భద్రపరిచారు. తరగతి గదులకు అవసరమైన ఫర్నీచర్‌, ల్యాబ్‌లకు అవసరమైన పరికరాలు, ఫర్నీచర్‌ కూడా ఇప్పటికే రావాల్సి ఉంది. అవీ వస్తే వాటిని ఎక్కడ భద్రపరచాలో అధికారులకు తలనొప్పిగా మారుతుంది. దీంతో మొదటి సంవత్సరం తరగతులు, లైబ్రరీ, ల్యాబ్‌లు సిద్ధమయ్యాకే పంపించమని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

ఆది నుంచి..

మెడికల్‌ కాలేజీ ప్రారంభం విషయంలో ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పట్టించుకోలేదు. దీని వల్ల అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. నంద్యాల మెడికల్‌ కాలేజికి స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన 50 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయింది. వివిధ రకాల వంగడాలపై పరిశోధనలు చేస్తూ రైతులకు మేలు చేస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను కేటాయించడంపై రైతులు, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో ఉన్న తమ భూముల ధరలు పెంచుకునేందుకు అధికార పార్టీ నేతలు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను మెడికల్‌ కాలేజీకి కేటాయించారన్న అభిప్రాయమూ ఉంది. దీంతో పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హై కోర్టును ఆశ్రయించారు. భూముల విషయంలో హై కోర్టు ఓ నిర్ణయానికి వచ్చే సరికి నాలుగు నెలలు పట్టింది. దీంతో ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన మెడికల్‌ కాలేజీ పనులు ఆగస్టు - సెప్టెంబరులో మొదలయ్యాయి. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన మెడికల్‌ కాలేజీ వ్యవహారం అగమ్యగోచరంగా మారింది. అలా కాకుండా కాలేజీకి సంబంధించిన స్థలాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలో కేటాయిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కుంటి సాకులు..

‘మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. అనుకున్న సమయానికి కాలేజీ నిర్మాణాలను పూర్తి చేస్తాం. ఎప్పటికపుడు పనులు పురోగతిని పరిశీలిస్తున్నాం’ ఇదీ స్థానిక ప్రజా ప్రతినిధులు తరచూ చెప్పే మాటలు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని నంద్యాల మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన వారు ఎవరైనా చెబుతారు. మెడికల్‌ కాలేజీ పునాదుల కోసం తవ్విన మట్టిని అమ్ముకోవడం మీద చూపిన శ్రద్ధను దాని నిర్మాణం మీద చూపెడితే ఈ పాటికి కాలేజీ నిర్మాణం పూర్తయ్యేదని పలువురు అంటున్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు అడ్డుకున్నారంటూ అధికార పార్టీ నేతలు పదే పదే కుంటి సాకులు చెబుతుండడం విడ్డూరంగా ఉంది.

ఏమీ తెలియదు..

మెడికల్‌ కాలేజీ పరిస్థితి ఎటూ తేలకపోయినా ప్రిన్సిపాల్‌ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఎంత మంది వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిగాయో? ఎంతమంది రావాల్సి ఉందో కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వీటి గురించి ఆమెను అడగ్గా.. వచ్చిన వారికి వచ్చినట్లు ఆర్డర్లు ఇస్తున్నామని, ఎంతమంది వచ్చారని లెక్కలేసుకుంటూ కూర్చోవడం తమ పని కాదని సమాధానం ఇచ్చారు. ఇక కాలేజీ విషయం కూడా పూర్తి స్థాయిలో తనకు తెలియదని, పై నుంచి సమాచారం వస్తే అపుడు చెబుతామని తెలిపారు. ఎన్‌ఎంసీ అధికారుల పరిశీలన, షోకాజ్‌ నోటీసులు జారీ తర్వాత కూడా ఏమి తెలియదని చెప్పడం ఆశ్చర్యం కలిగించేదే. ఇది తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నమా? పట్టింపులేని వైఖరా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.

హాస్టళ్ల నిర్మాణం పూర్తయ్యేనా?

మెడికల్‌ కాలేజీలో చేరే వైద్య విద్యార్థుల కోసం ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాంగణంలోనే హస్టల్‌ భవనాలను కడుతున్నారు. వీటి నిర్మాణాల పరిస్థితి చూస్తే ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. బాలికల హాస్టల్‌ గ్రౌండ్‌ లెవెల్‌ వరకు పూర్తికాగా, బాలుర హాస్టల్‌ అసలు బేస్‌మెంట్‌ లెవెల్‌ కూడా దాటలేదు. అధికారులు మాత్రం అది పెద్ద సమస్యే కానేకాదు అని చెబుతున్నారు. అనుకున్న సమయానికి హాస్టల్‌ భవనాలు పూర్తి కాకపోతే పట్టణంలోని ప్రైవేటు భవనాల్లో తాత్కాలికంగా హాస్టల్‌ వసతి ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటికే హాస్టల్‌కు అనుగుణంగా ఉండే భవ నాలను కొన్నింటినీ పరిశీలించామని చెబుతున్నారు. హాస్టల్‌ కోసం భవనాలను పరిశీలిస్తున్నారు సరే.. మరి వాటికి అయ్యే ఖర్చు ఎవరి ఖాతాలో భరిస్తారు అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ఒకవేళ సంబంధిత శాఖ భరించినా అది ఆ శాఖకు అదనపు భారమే.

పూర్తి వివరాలు వచ్చాక చెబుతాం

మెడికల్‌ కాలేజీ గురించి పై నుంచి పూర్తి సమాచారం లేదు. వచ్చిన తర్వాత ఏమిటనే విషయం తెలియజేస్తాం. ఇక కాలేజీకి సంబంధించిన నియామకాలను కూడా చేపట్టాం. ఎంతమందిని నియమించాం అనే వివరాలు పూర్తిస్థాయిలో నా వద్ద లేవు. కనుక్కుని చెబుతాను.

- డా. స్వర్ణలత, ప్రిన్సిపాల్‌, మెడికల్‌ కాలేజీ, నంద్యాల

Updated Date - 2023-03-30T23:49:54+05:30 IST