Share News

మార్కెట్‌లో దొంగలు..

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:47 AM

రాష్ట్రంలోనే పంట ఉత్పత్తుల క్రయ విక్రయాల్లో ముందు వరుసలో ఉన్న కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులో దొంగలు పడ్డారు.

మార్కెట్‌లో దొంగలు..

కందులు.. మినుముల బస్తాల చోరీ

ఇలాగైతే కొనుగోలు చేయలేమంటున్న వ్యాపారులు

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 30: రాష్ట్రంలోనే పంట ఉత్పత్తుల క్రయ విక్రయాల్లో ముందు వరుసలో ఉన్న కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులో దొంగలు పడ్డారు. సెక్యూరిటీ గార్డులు, అధికారులు, సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తున్నా దొంగలు తమ పని కానిచ్చేశారు. రైతులు తెచ్చిన పంట సరుకుతోపాటు వ్యాపారులు షాపుల వద్ద నిల్వ చేసిన ఉత్పత్తులను బయటకు చాకచక్యంగా తరలిస్తున్నారు. రెండు రోజుల కిందట రెండు బస్తాల కందులు, మరో రెండు బస్తాల మినుములు దొం గతనం చేసి బయటకు తరలించారు. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. భద్రత కల్పించకుంటే జనవరి 2 నుంచి రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయలేమని సెక్రటరీకి వినతి పత్రం అం దజేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఇద్దరు దొంగలను గుర్తు పట్టినట్లు మార్కెట్‌ కమిటీ అధికారవర్గాలు తెలిపాయి. ఇద్దరు దొం గలపై వివరాలతో సహా నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కందులను దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిజం రాబట్టారు. ఒకరి నుంచి కందులను రికవరీ చేసి వ్యాపా రికి అప్పజెప్పారు. మినుములను దొంగతనం చేసిన మరో వ్యక్తిని కూడా మార్కెట్‌ కమిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. అయితే.. ఈ వ్యక్తి ఒక రిటైర్డు కానిస్టేబుల్‌ కొడుకు కావడంతో పోలీసులు ఆ వ్యక్తికి క్లీన్‌చీట్‌ ఇచ్చి వదిలివేసినట్లు మార్కెట్‌ కమిటీ అధికారులు చర్చించుకుంటున్నారు. ఇలా అయితే.. తాము రైతుల నుంచి ఏ విధంగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి షాపుల వద్ద ఎలా నిల్వ చేయాలని వ్యాపారులు మార్కెట్‌ కమిటీ అధికారులను నిలదీసినట్లు సమాచారం. గతంలో కూడా రైతులు తెచ్చిన వేరుశనగ, ఉల్లిగడ్డలు, వాము, తదితర పంట ఉత్పత్తులను దొంగలు చాకచక్యంతో బయటకు తరలించారు. మళ్లీ ఇటీవల కాలంలో దొంగలు పేట్రేగిపోతుండటంతో రైతులతో పాటు వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దొంగలను పట్టుకుని రైతులకు, వ్యాపారుల పంట ఉత్పత్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Dec 31 , 2023 | 12:47 AM