కడగళ్ల వాన ..!

ABN , First Publish Date - 2023-03-18T00:10:29+05:30 IST

అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం మిగిల్చింది.

కడగళ్ల వాన ..!

అకాల వర్షానికి నీట మునిగిన పంటలు

దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మిరప

వందలాది ఎకరాల్లో పంట నష్టం

నంద్యాల, ఆంధ్రజ్యోతి/కర్నూలు (అగ్రికల్చర్‌), మార్చి 17:

అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం మిగిల్చింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన వడగండ్ల వానకు ఉమ్మడి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంటలు బాగా పండాయి.. ఇక ఇంటికి చేర్చడమే తరువాయి అని రైతులు ఆశతో ఉండగా వడగళ్ల వాన నిరాశకు గురి చేసింది. తుఫాను ప్రభావంతో గురువారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షానికి ఉమ్మడి జిల్లాలోని వందలాది హెక్లార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, వరి, అరటి తోటలు నేలవాలగా.... కల్లాల్లో ఆరబెట్టిన మిరప, ఉల్లి దిగుబడులు వాన నీటికి తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా తుఫాన్లు పంటలను దెబ్బతీశాయని... ఈసారి అంతా బాగుందనుకున్న సమయంలో వడగండ్ల వాన తమ కష్టాన్ని నీటిపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి కారణంగా గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, సంజామల, మండలాల్లో మొక్కజొన్న, వరి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోవెలకుంట్ల డివిజన్‌ పరిధిలో మొత్తం మీద 3,469 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఇక కల్లాల్లో ఆరబెట్టిన మిరప నీటికి తడిసిపోయింది. నంద్యాల డివిజన్‌ పరిధిలో కురిసిన వడగళ్ల వానకు గడివేముల మండలంలో ఎక్కువగా పంట నష్టం వాటిల్లింది. మంచాలకట్టలో మొక్కజొన్న, అరటి తోటలు నేలవాలాయి. అకాల వర్షానికి ఈ ఒక్క మండలంలోనే దాదాపు రూ.2 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ మండలంలో ఏకంగా 1,500 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట నీటి పాలవగా, చాగలమర్రి మండలంలో 600 ఎకరాలకు పైగా నష్టం వాటిల్లింది. ఇక బొప్పాయి, నిమ్మ తోటలు దెబ్బతినగా... మామిడి పూత, పిందెలు నేల రాలాయి. ఈ డివిజన్‌ పరిధిలో దాదాపు రూ.10 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలోని ఆదోని, కోసిగి, ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాల్లో ఎల్లెల్సీ కింద దాదాపు 30 వేల ఎకరాల్లో మిరప, వేరుశనగ, ఉల్లి, పత్తి పంటలను రైతులు సాగు చేశారు. నెల కిందట ఈ పంటలను కల్లాల్లో నిల్వ చేశారు. రేపో మాపో మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లి అమ్ముకుందామని అనుకోగా అకాల వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే కనీస ధర అందక అల్లాడిపోతున్న ఉల్లి రైతుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. గాజులదిన్నె ఆయకట్టు కింద అధిక భాగం దాదాపు రెండు వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేశారు. ఈ పంట చేతికందే సమయంలో వర్షం తీవ్రంగా నష్టం చేకూర్చింది.

కూలిన చెట్లు.. నేలవాలిన స్తంభాలు..

గాలి వాన వల్ల ఉమ్మడి జిల్లాలోని అనేక మండలాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి. ఆళ్లగడ్డ మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. బలమైన గాలులు వీచడంతో చెట్లు కూలాయి. ఇక చాగలమర్రి, ఉయ్యాలవాడ మండలాల్లో కురిసిన వర్షానికి విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో గురువారం సాయంత్రం నుంచి ఈ మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆర్‌.పాంపల్లి, కొండుపల్లి, సర్వాయిపల్లె, హరివరం గ్రామాల్లో పిడుగుపాటుకు 845 పొట్టేళ్లు చనిపోయాయని పశుసంవర్థశాఖ అధికారులు తెలిపారు. ఇక శిరివెళ్లలో ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. ఈ మండలంలోని మహదేవపురంలో పిడుగుపాటుకు గురై రాచకుంట్ల ఆంజనేయులు(45) అనే వ్యక్తి మరణించాడు. మిడ్తూరు, గడివేముల మండలాల్లో వడగళ్ల వాన కురిసింది.

గత సంవత్సరం అలా..

గతేడాది అసాని తుఫాను దెబ్బకు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాని నుంచి కాస్త తేరుకోగానే మాండస్‌ తుఫాను విరుచుకుపడింది. ఈ రెండు తుఫానుల కారణంగా వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చిన్నచూపు చూసింది. పంట నష్టాన్ని అంచనా వేయాల్సిన అధికారులు రకరకాల కొర్రీలు పెట్టి పంట నష్టాన్ని తక్కువ చేసి చూపారు. ప్రస్తుత అకాల వర్షానికి జరిగిన పంట నష్టం అంచనా వేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2023-03-18T00:10:29+05:30 IST