ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం: పీఠాధిపతి
ABN , First Publish Date - 2023-09-26T01:04:09+05:30 IST
మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే ముఖ్యమని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు.

శ్రమదానం చేసిన వెయ్యి మంది కర్ణాటక వలంటీర్లు
మంత్రాలయం, సెప్టెంబరు 25: మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే ముఖ్యమని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. సోమవారం కర్ణాటక మాజీ మంత్రి అరవిందు లింబావలి, బీజేపీ బెంగళూరు టౌన్ అధ్యక్షుడు సుబ్బనరసింహ ఆధ్వర్యంలో మఠం సహకారంతో కర్ణాటక నుంచి వచ్చిన వెయ్యి మంది వలంటీర్లతో మంత్రాలయం శ్రమదానానికి శ్రీకారం చుట్టారు. యోగీంద్ర కళా మండపంలో స్వచ్ఛందంగా వచ్చిన వలంటీర్లకు తట్టలు, చీపుర్లు, గ్లౌజులు, బుట్టలు, పారలు, ముళ్లకంప తొలగించే పరికరా లను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అందజేశారు. ఈ శ్రమదానం సోమ, మంగళవారాల్లో రెండు రోజులు చేపట్టినట్లు తెలిపారు. తుంగభద్ర నది తీరం, ఆర్టీసీ బస్టాండు, ప్రధాన రహదారులు, మఠం ప్రాంగణం, తుంగభద్ర కారిడార్, మద్వమార్గ్ కారిడార్, అన్నపూర్ణ భోజన శాల, రాఘవేంద్రసర్కిల్, పోలిస్‌స్టేషన్, ఆసుపత్రి, మఠం క్వాటర్స్ తదితర ప్రాంతాల్లో గ్రూపులుగా విడిపోయి మంత్రాలయంలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టిని తొలగించి శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్, రసాయనాలను చల్లారు. మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి, ఈఈ సురేష్ కోనాపూర్, ఏఈ బద్రీనాథ్, శ్రీహరి, సూపరింటెండెంట్ అనంతపురాణిక్, బీఎం ఆనందరావు, జేపీ స్వామి, ద్వారపాలక అనంతస్వామి, వ్యాసరాజాచార్ బిందు మాదవ్ తదితరులు పాల్గొన్నారు.