పాత పెన్షన్ సాధనే లక్ష్యం
ABN , First Publish Date - 2023-09-25T00:27:13+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ సాధనే లక్ష్యంగా ఆందోళన కొనసాగిస్తామని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ బి.మాధవస్వామి అన్నారు.

నంద్యాల టౌన్, సెప్టెంబరు 24 : ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ సాధనే లక్ష్యంగా ఆందోళన కొనసాగిస్తామని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ బి.మాధవస్వామి అన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా ఎస్‌టీయూ కార్యాలయంలో ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు సోమేసుల చంద్రశేఖర్, నగిరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముఖ్య ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తమ పాదయాత్రలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వారంలోపే అమలు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర్ర ఏళ్లైనా కమిటీలతో కాలయాపన చేసి చివరకు సీపీఎస్ స్థానంలో అత్యంత ప్రమాధకరమైన జీపీఎస్‌ను అమలు చేస్తామని చెప్పడం ఉద్యోగులందరినీ మోసగించడమేనని అన్నారు. మంత్రి మండలిలో జీపీఎస్ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సీపీఎస్, జీపీఎస్‌ను రద్దు చేసి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఏపీసీపీఎస్‌ఈఏ, ఫోర్టో, ఏపీసీపీఎస్‌యూఎస్ సంఘాలు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయని అన్నారు. ఈ నెల 25న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్ -257, ఏపీటీఎఫ్ -1938, ఏపీసీపీఎస్‌ఈఏ, ఏపీసీపీఎస్‌యూఎస్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.