ఆ నిబంధనే అసలైన పరీక్ష
ABN , First Publish Date - 2023-03-15T23:36:36+05:30 IST
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి.
విద్యార్థులకు ‘నిమిషం’ కష్టాలు
అనుమతిలేకపోవడంతో ముగ్గురికి నిరాశ
పరీక్ష కేంద్రాల్లో తిరగని ఫ్యాన్లు, వెలగని లైట్లు
మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ చిక్కిన విద్యార్థి
ఉమ్మడి జిల్లాలో 1,231 మంది గైర్హాజర్
కర్నూలు(ఎడ్యుకేషన), మార్చి 15: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పేపరు-1 తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, ఒకేషనల్ సబ్జెక్టు పరీక్షలు జరిగాయి. నిమిషం ఆలస్యం నిబంధనతో విద్యార్థులు, తల్లిదండ్రులు అవస్థలు ఎదుర్కొన్నారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులతో అధిక సంఖ్యలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు రద్దీగ కనిపించాయి. కర్నూలు నగరంలోని కార్పొరేట్ కళాశాలల్లో మాత్రం ఓ వైపు పరీక్షలు నిర్వహిస్తూనే మరో పక్క తరగతులు కొనసాగించారు. తుగ్గలి ఏఎస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో మాల్‌ప్రాక్టీసు పాల్పడిన ఒక విద్యార్థిని బుక్ చేసి కేసు నమోదు చేశారు.
మొదటి రోజున 1,231 మంది గైర్హాజర్
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు మొదటి రోజున 1,231 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో గురువయ్యశెట్టి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 35,077 మంది నమోదు చేసుకోగా 33,846 మంది పరీక్షకు హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో 71, నంద్యాల జిల్లాలో 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పేపర్-2 తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలు జరగనున్నాయి.
ఏడాది చదువు వెనక్కి..
కర్నూలు టౌనమోడల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెంకటేశ్వర్లు అనే విద్యార్థి ద్వితీయ సంవత్సరం (హెచఈసీ గ్రూపు) చదువుతున్నాడు. కర్నూలు ఈద్గా ఎదురుగా ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో సెంటర్‌ను కేటాయించారు. బుధవారం ఆ విద్యార్థి సొంత గ్రామం వెల్దుర్తి నుంచి బయలుదేరాడు. బస్సు ఆలస్యం కారణంగా 9.15 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అప్పటికే సెంటర్ మెయినగేటు మూసివేశారు. పరీక్ష రాసేందుకు అనుమతించాలని బతిమలాడినా నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీంతో ఆ విద్యార్థి ఆవేదనతో వెనుదిరిగాడు. మద్దికెరలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హోసూరుకు చెందిన ఉషారాణి, బురుజులకు చెందిన సుస్మాస్వరాజ్ మద్దికెరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివారు. మద్దికెర మోడల్ స్కూల్‌లో సెంటర్ కేటాయించగా రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. నిర్వాహకులు లోపలికి అనుమతించకపోవడంతో కన్నీరు పెట్టుకుంటూ వెనక్కు వెళ్లిపోయారు. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులు ఏడాది విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
సౌకర్యాల్లేక అవస్థలు..
కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు తిరగలేదు. ట్యూబ్‌లైట్లు వెలగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సీసీ కెమెరాలు పని చేయలేదు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడం వల్ల ఆటోలు, మోటారు సైకిళ్లపైన విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి వచ్చింది. కొంత మంది విద్యార్థులు హాల్ టికెట్లు లేకుండా పరీక్ష కేంద్రాలకు రావడంతో నిర్వాహకులు డౌనలోడు చేసి ప్రింట్ తీసి లోపలికి పంపారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పి.కోటేశ్వరరావు తనిఖీ చేశారు. అలాగే నగరంలోని పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్ర పరిశీలకులు నాగవేణి, జిల్లా కన్వీనర్ ఆర్‌ఐవో గురువయ్యశెట్టిలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మొదటి రోజున ఉమ్మడి జిల్లాలో మొత్తం 70 పరీక్ష కేంద్రాలను ఆర్‌ఐవో, డీవీఈవోఎస్‌లు, హెచఈసీ, డీఈసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ
నంద్యాల (నూనెపల్లె), మార్చి 15: నంద్యాల జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాలను కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన, ఎస్పీ రఘువీర్‌రెడ్డి తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల అధికారులకు, చీఫ్ సూపరింటెండెంట్లకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ సెంటర్లు మూయించాలని ఆదేశించారు. మౌలిక వసతులను సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. వారి వెంట డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ హరినాథరెడ్డి, ఆర్ ఎస్‌ఐ వీరన్న ఉన్నారు.