కూతురితోపాటు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-04-12T00:42:09+05:30 IST

ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఓ కుటుంబాన్ని రైల్వే పోలీసులు కాపాడారు.

   కూతురితోపాటు ఆత్మహత్యాయత్నం
ఆదోని రైల్వే పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పద్మనాభ కుటుంబ సభ్యులు

-రక్షించిన ఆదోని రైల్వే పోలీసులు

-కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు

ఆదోని, ఏప్రిల్‌ 11: ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఓ కుటుంబాన్ని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ఆదోని పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తెరమాన బట్టు తాలుక, సాధగర్‌ గ్రామానికి చెందిన పద్మనాభం, శెల్వి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కరోనా సమయంతో మృతి చెందింది. ఎంబీఏ వరకు చదువుకున్న రెండో కూతురు జీవితను చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన మహేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 12 ఏళ్ల కూతురు ఉంది. మహేష్‌ జీవితను మానసికంగా, శారీరకంగా హింస పెట్టడమే కాకుండా, అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేసేవాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల చెంతకు చేరింది. కుమార్తె సంసారం కుదుట పడలేదని, జీవితంలో ఓడిపోయామని పద్మనాభం, శెల్వి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఈనెల 10వ తేదిన గ్రామం నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడి నుంచి ఉద్యాన ఎక్స్‌ప్రెస్‌లో ఆదోనికి బయలుదేరారు. 11వ తేదీ తెల్లవారుజామున 3.46 గంటల సమయంలో రైలు ఆదోనికి చేరింది. 4వ నెంబర్‌ ప్లాట్‌ఫారంపై ఎడమ వైపు దిగకుండా, కుడి వైపు పట్టాలపై దిగి అదే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. రైలులోని ప్రయాణికులు గుర్తించి కేకలు వేశారు. విధుల్లో ఉన్న హోంగార్డు ఖాద్రి పరుగున అక్కడికి చేరుకోనే లోగానే పద్మనాభం ఎడమ చేయి పూర్తిగా తెగిపడింది. శెల్వి, జీవిత గాయాలతో బయటపడ్డారు. వీరిని హుటాహుటిగా ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రైల్వే ఎస్సై రామస్వామి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-04-12T00:42:10+05:30 IST