Share News

పనులు ఆపేసి పరార్‌

ABN , First Publish Date - 2023-12-10T23:35:42+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి దండం పెట్టి మరీ ఓ కాంట్రాక్టర్‌ పరార్‌ అయ్యాడు.

పనులు ఆపేసి పరార్‌

రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌

నిలిపిపోయిన గోరంట్ల - కొత్తపల్లి బ్రిడ్జి పనులు

జగనన్న హామీకే నిధులు కరువు

సెప్టెంబరులో నిలిపివేసిన వైనం

కోడుమూరు, డిసెంబరు 10: వైసీపీ ప్రభుత్వానికి దండం పెట్టి మరీ ఓ కాంట్రాక్టర్‌ పరార్‌ అయ్యాడు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో తట్టాబుట్టా సర్దుకొని పలాయనం చిత్తగించాడు. కోడుమూరు మండలం గోరంట్ల - కొత్తపల్లి గ్రామాల హంద్రీ నదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణం, హంద్రీ నుంచి కొత్తపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.21 కోట్లు విడుదల చేసింది. టెండర్‌ ప్రక్రియను వైఎంఆర్‌ కన్‌స్ట్స్రక్షన్‌ సంస్థ చేజిక్కించుకుంది. ఈ ఏడాది జనవరి 24న పీఐయూ పర్యవేక్షణలో వేగవంతంగా పనులను ప్రారంభించారు. హంద్రీ నదిపై రూ.కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టి సుమారు 19 పిల్లర్లను నిర్మించారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణంలో భాగంగా కంకరను పరిచారు. ఖర్చుల వ్యయం పెరిగిపోయింది. బిల్లుల చెల్లింపులో అదిగో ఇదుగో అంటూ అధికారులు కాలయాపన చేశారు. సుమారు రూ.6 కోట్లకు వరకు బిల్లులు పేరుకపోయాయి. బిల్లులు వస్తాయని అధికారులు చెబుతున్నా వైసీపీ ప్రభుత్వంపై కాంట్రాక్టర్‌కు నమ్మకం పోయింది. దీంతో డబ్బులు ఇస్తే తప్ప పనులు చేయలేనంటూ కొన్ని యంత్రాలను వదిలేసి వెళ్లిపోయాడు.

జగనన్న హామీకే నిధుల్లేవు..

2017 నవంబరు 25లో జగనన్న ఓదార్పు యాత్రలో భాగంగా క్రిష్ణగిరి మండలం ఎర్రగుడి గ్రామం నుంచి హంద్రీ నదిలో నడుచుకుంటూ గోరంట్ల గ్రామం చేరుకున్నారు. గోరంట్ల గ్రామంలో చేపట్టిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే హంద్రీ నదిపై వంతెన నిర్మించి ఇక్కడి ప్రజల చిరకాల కోరికను తీరుస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ కదా అని పనులు చేస్తే త్వరగా వచేస్తాయని కాంట్రాక్టర్‌ ఎంతో ఉత్సాహంగా పనులను ప్రారంభించాడు. జగనన్న ఇచ్చిన హామికే నిధులు దిక్కులేవని కాంట్రాక్టర్‌కు ఆలస్యంగా అర్థమైంది. పనులు ఇలాగే చేసుకొంటూ పోతే.. రూ.21 కోట్లు మునిగిపోతాయని తెలుసుకొని పనులను నిలిపివేసి చెప్పపెట్టకుండా పరార్‌ అయ్యాడు. పనులు నిలిచిపోయి సుమారు మూడు నెలలు పూర్తి అయ్యాయి. అయితే పనులను మొదలు పెట్టాలని కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు వేడుకొనే పరిస్థితులు ఉన్నాయి.

పనులను ఆర్భాటంగా ప్రారంభించిన మంత్రి

పనులను ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రారంభించారు. ఇది జగనన్న హామీ.. కోడుమూరు, క్రిష్ణగిరి మండలాల ప్రజల దశాబ్దల సమస్యకు దారి చూపిన జగనన్న అంటూ ఈ ఏడాది జనవరి 24న బ్రిడ్జి పనులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ సంజీవ్‌కుమార్‌ పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు శ్రీదేవి, డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌, కూడా చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి జిల్లాలోని మరి కొంత మంది ప్రముఖులు హాజరై హంద్రీనదిపై నిర్మించే వంతెన నిర్మాణానికి ఎంతో అట్టాసంగా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ శిలాఫలకం వెక్కిరిస్తోంది.

తుప్పు పడుతున్న యంత్రాలు

గత మూడు నెలల క్రింద కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసి యాంత్రాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో యాంత్రాలు తుప్పుపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకొని సదరు కాంట్రాక్టర్‌ కోడుమూరు నియోజకవర్గంలో సుంకేసుల-కర్నూలు రోడ్డు, ముడుమలగుర్తి, బూడిదపాడు, గొందిపర్ల, బ్రాహ్మణదొడ్డి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు సమాచారం. రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసినా ఇంత వరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ భారీ ఎత్తున నష్టాపోయినట్లు తెలిసింది. బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించే పనిలో సదరు కాంట్రాక్టర్‌ ఉన్నట్లు సమాచారం.

బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి

గోరంట్ల-కొత్తపల్లి హంద్రీనదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు జరిగాయి. అందుకు సంబంధించిన బిల్లులు విడుదల కాలేదు. చేసిన పనులకుగాను సుమారు రూ.3 కోట్ల వరకు రావాల్సి ఉంది. పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించాం. ఐదు రోజుల్లో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొంటున్నాం.

-మద్దన్న, ఈఈ, పంచాయతీ రాజ్‌ శాఖ (పీఐయూ)

Updated Date - 2023-12-10T23:35:45+05:30 IST