ఎస్‌ఎస్ ట్యాంకు.. బంగారు బాతు
ABN , First Publish Date - 2023-10-30T00:18:40+05:30 IST
ఆదోని ఎస్‌ఎస్ ట్యాంకు జనాలకు నీరు ఏం అందిస్తోందోగాని కొందరికి కాసులు కురిపిస్తోంది.
ఆదోని ఎస్‌ఎస్ ట్యాంకుకు అవినీతి పగుళ్లు
రూ.1.80 కోట్ల పనుల్లో లోపించిన నాణ్యత
పర్సెంటేజీలు పంచుకుతింటున్న అధికారులు, వైసీపీ నాయకులు
ఆదోని, అక్టోబరు 29 : ఆదోని ఎస్‌ఎస్ ట్యాంకు జనాలకు నీరు ఏం అందిస్తోందోగాని కొందరికి కాసులు కురిపిస్తోంది. పదే పదే అత్యవసర పనుల పేరుతో పర్సెంటేజీలు కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎస్‌ఎస్ ట్యాంక్ పనులు కొందరికి బంగారు బాతులా మారాయి. ట్యాంకుకు చేసే మట్టి పనులను పరిశీలించి లెక్క కట్టడం కూడా కష్టమే. ఎలా పనులు చేసినా, చెల్లుబాటు అవుతుందన్న ధీమాతో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. నాసిరకంగా పనులు చేసి అధికార పార్టీ వాళ్లూ, అధికారులూ పర్సంటేజీలను పంచుకొని జేబులు నింపుకుంటునానరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆదోని పట్టణ ప్రజల దాహార్తి తీర్చే బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంకు అధ్వానంగా తయారైంది. నిర్వాహణ లోపాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో 1999-2004 మధ్య పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు 166 ఎకరాల స్థలాన్ని సేకరించి రూ.25 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ను నిర్మించారు. 2005లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్‌ఎస్ ట్యాంక్‌ను ప్రారంభించింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3110 ఎం.ఎల్. (మిలియన్ లీటర్లు). పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీని కెపాసిటీ పెంచడానికి నిధులు మంజూరు చేశారు. పక్కనే ఉన్న తుంగభద్ర దిగువ కాలువ నీటితో ఎస్‌ఎస్ ట్యాంక్‌ను నింపేలా చర్యలు తీసుకున్నారు. దీని దగ్గర శుద్ధి చేసిన నీటిని అక్కడి నుంచి నీటి పైపుల ద్వారా పట్టణానికి తెచ్చి, ప్రజలకు సరఫరా చేస్తారు. ప్రతి రోజూ సుమారు 22 నుండి 24 ఎం.ఎల్ వినియోగిస్తారు.
ప్రమాదపుటంచున ఎస్‌ఎస్ ట్యాంక్
ప్రస్తుతం బసాపురం ఎస్‌ఎస్ ట్యాంక్ కట్టపై రెండు, మూడు చోట్ల పగుళ్లు వచ్చాయి. ట్యాంక్ కింది భాగంలో వేసిన సిమెంట్ స్లాబ్ మొత్తం చెదిరిపోయింది. రెండు చోట్ల సిమెంట్ స్లాబ్ లోపలి భాగంలో 210 మీటర్లు పూర్తిగా కూరుకుపోయింది. దీంతో పాటు ట్యాంకు లోపలి భాగం మరి కొంత భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మరమ్మతుల కోసం రూ.కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ ట్యాంక్ ఉందని రాంజల చెరువును మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో ఆ చెరువులో ఉన్న నీరు ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఎస్‌ఎస్ ట్యాంకు దెబ్బతినిపోవడంతో రాంజల చెరువులో పాడైన నీటిని తొలగించి, కొత్త నీటిని నింపి ప్రజల అవసరాలు తీర్చాలని కోరుతున్నారు.
ఎస్‌ఎస్ ట్యాంక్‌పై అధికారుల నిర్లక్ష్యం
బసాపురం ట్యాంక్ నిర్వహణలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఆరేళ్ల క్రితం ఎస్‌ఎస్ ట్యాంక్ లోపలి భాగంలో సిమెంట్ స్లాబ్స్ జారిపోయి అక్కడక్కడా రంధ్రాలు బయటపడ్డాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు చూస్తూ ఉండిపోయారే తప్ప సమస్యను పట్టించుకోలేదు. చివరికి 2017-18 మధ్యకాలంలో ఎస్‌ఎస్ ట్యాంక్ దెబ్బతిన్న చోటే అత్యవసర మరమ్మతు పేరుతో రూ.30 లక్షలు ఖర్చు చేసి తాత్కాలికంగా సరిచేశారు. ఆ పనులలో కూడా నాణ్యతకు పంగనామాలు పెట్టారు. దీంతో అక్కడే ఏడాదిలో మరోసారి దెబ్బతిన్నది. అధికారులు ఆ కాంట్రాక్టర్‌కు మొత్తం డబ్బు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రెండోసారి దెబ్బతిన్నప్పుడు మరమ్మతు పనులకు కడప జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు రూ.1.80 కోట్ల సాధారణ నిధులు వెచ్చించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.80 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.కోటిని అధికారులు నిలిపేశారు. సదురు కాంట్రాక్టర్ ఆ బిల్లు కోసం అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి అధికారులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఎస్‌ఎస్ ట్యాంక్‌ను వినియోగంలోకి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో నింపుతూ వచ్చారు. ముచ్చటగా మూడోసారి కూడా ట్యాంక్ కట్ట అక్కడే దెబ్బతినిపోయింది. ఇదంతా యాదృశ్చికం కాదని, నిర్మాణం పనులలో నాణ్యత లోపం, పర్సెంటేజీల పాపం అన్నీ కలిసి ఇలా అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
బసాపురం ఎస్‌ఎస్ ట్యాంక్ సామర్థ్యం ఇలా..
ఎస్‌ఎస్ ట్యాంక్ నీటి సామర్థ్యం : 3110 ఎంఎల్
ట్యాంక్‌పై ఆధారపడిన జనాభా : మూడు లక్షలు
ట్యాంక్ కొలత : 3,400 మీటర్లు
ట్యాంక్ లోతు : 25 మీటర్లు
ట్యాంక్ నిర్మాణ వ్యయం : రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు
పూర్తి స్థాయిలో మరమ్మతులకు అంచనా వ్యయం రూ.20 కోట్ల
నుంచి 30 కోట్లు
ఈ విషయం పై కమిషనర్ రఘునాథ్ రెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.... 15 రోజుల్లో మట్టి పనులు పూర్తి చేసి పట్టణానికి తాగునీటి సమస్య రాకుండా చూస్తాం అన్నారు. అవసరమైనంత మేరకే ట్యాంకులకు నీళ్లు పంపింగ్ చేస్తాం అన్నారు. నవంబర్ నెలాఖరులోగానే దిగువ కాలువకు ముందు జాగ్రత్త చర్యగా మట్టి బస్తాలు వేసి నీటిని నిలువు చేసేందుకు కసరత్తు చేశాం అన్నారు. ఎలాగైనా నీటిసమస్య రాకుండా చూసేందుకు అన్ని ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు.