సమస్యలు పరిష్కరించండి: జేసీ
ABN , First Publish Date - 2023-09-22T23:38:06+05:30 IST
మండలంలోని ప్రజలు సమస్యలకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు.
బేతంచెర్ల, సెప్టెంబరు 22: మండలంలోని ప్రజలు సమస్యలకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో ‘జగనన్నకు చెబుదాం’ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని మండల స్థాయి, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి రోజు 3 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి, సూచించిన మూడు రిజిస్టర్‌లలో సమస్యలను నమోదు చేయాలన్నారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తు మీద క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన విచారణ జరిపి నివేదికలు పంపాలని ఆదేశించారు. మండల స్థాయి స్పందనకు 167 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటిని క్షుణ్ణంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్డీవో వెంకటరెడ్డి, జడ్పీ సీఈవో సుబ్బారెడ్డి, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి ఎంపీడీవో వెంకన్న, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.