శివుడే దిక్కు

ABN , First Publish Date - 2023-02-05T23:52:56+05:30 IST

శ్రీశైలంలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ఇక వారం కూడా వ్యవధి లేదు.

శివుడే దిక్కు

బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దృష్టి సారించని అధికారులు

అధ్వానంగా కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి

కాలినడక భక్తుల కష్టాలు ఆ దేవుడికే ఎరుక

మల్లన్న భక్తులకు ఈసారి మరిన్ని కష్టాలే!

11 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఆత్మకూరు, ఫిబ్రవరి 5:

శ్రీశైలంలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ఇక వారం కూడా వ్యవధి లేదు. దేశం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. భక్తులకు విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, తాగునీరు వంటి కనీస సదుపాయాల ఏర్పాట్లపై దృష్టి సారించలేదు. ప్రధానంగా కాలినకడన వెళ్లే భక్తులు తాగునీటి సమస్యను ఎదుర్కోనున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నా మందులు సరిగా ఉండడం లేదన్న వాదన వినిపిస్తోంది.

ప్రతిఏటా మల్లన్న భక్తులకు కష్టాలు తప్పడం లేదు. ప్రత్యేకించి కాలినడకన తరలివెళ్లే భక్తులకు అటవీ మార్గంలో అనేక అగచాట్లు ఎదురవుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే శివస్వాములు, యాత్రికులు ఆత్మకూరు మీదుగా కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి మీదుగా పాదయాత్ర సాగించి వెంకటాపురం గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి పంట పొలాల గుండా నాగలూటి చెంచుగూడెం చేరుకుంటారు. ఆ తర్వాత ఐదు కి.మీ. అటవీ మార్గంలో ప్రయాణించి నాగలూటి వీరభద్రాలయానికి సందర్శించి అక్కడి నాగలూటి తిప్పలు, దామర్లకుంట, నల్లమల కొండలపై అడవి మార్గం గుండా సుమారు 14 కి.మీ భక్తులు ప్రయాణించి పెచ్చెర్వు చెంచుగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తుల కొండ, కోర్కెల గుండా అటవీ ప్రాంతంలో 16 కి.మీ ప్రయాణిస్తే భీముని కొలను ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత ప్రమాదకర జారుడు కొండపై ప్రయాణించి కైలాస ద్వారానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 6 కి.మీల దూరం ప్రయాణిస్తే.. శ్రీశైలానికి చేరుకోవచ్చు. అయితే కాలినడకన వెళ్లే భక్తులకు దారి పొడవునా అనేక ఇక్కట్లు తప్పడం లేదు.

సదుపాయాల కల్పనలో విఫలం

శ్రీశైలానికి పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. పెచ్చెర్వు, నాగలూటి ప్రాంతాల్లో దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాలను మినహాయిస్తే మిగతా సౌకర్యాలేవీ కనిపించవు. నాగలూటిలో ఉన్న చిన్నపాటి కోనేరు నీరు వేలాది మంది భక్తులకు దాహార్తి తీరుస్తోంది. అయితే కోనేరులో వ్యర్థాలు చేరి నీరు కలుషితమవుతోంది. అయినప్పటికీ అదే నీటిని తాగాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే అక్కడే ఉన్న మరో పెద్దకోనేరులో కూడా శివస్వాములు, పాదయాత్రికులు స్నానమాచరిస్తారు. వేలాదిగా భక్తులు తరలి రావడం వల్ల కోనేరులోని నీరంతా రంగుమారి దుర్వాసన వెదజల్లుతూ రోగాలకు కారణమవుతోంది. వాస్తవానికి నాగలూటి వీరభద్రాలయం వరకు వాహనాలు వెళ్లేందుకు ఆస్కారం ఉంది. కనీసం ట్యాంకర్ల ద్వారా నీటి తరలిస్తే తాగునీటి కష్టాలు తీరుతాయి. అలాగే అటవీ ప్రాంతంలో కాకుండా వెంకటాపురం, రాధాపురం ప్రాంతాల్లో మాత్రమే దేవస్థానం వారు విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ అవి భక్తులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతున్నాయి. కాగా భీమునికొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నప్పటికీ వాటి ద్వారా కూడా దుర్వాసన వెదజల్లే నీరు వస్తుండటంతో ఆ నీటికి తాగలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నామమాత్రపు వైద్య శిబిరాలు

శ్రీశైలానికి తరలివెళ్లే భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దారిపొడవునా అక్కడక్కడా వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తారు. అయితే వీటి నిర్వహణ ప్రతిఏటా నామమాత్రంగానే ఉంటోంది. శ్రీశైలానికి 24 గంటలపాటు భక్తులు తరలివెళ్తుంటారు. అయితే వైద్యశిబిరాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే కొనసాగిస్తున్నారు. ఈసారి అటవీ ప్రాంతంలో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతామని శ్రీశైల దేవస్థానం అధికారులు చెబుతున్నా ఆచరణలోకి తీసుకొస్తారో లేదో వేచి చూడాల్సిందే.

దారి పొడవునా నిలువు దోపిడే

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా ఆత్మకూరు గుండా శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న మల్లన్న భక్తులు దారిపొడవునా.. నిలువు దోపిడీకి గురవుతున్నారు. చిన్నపాటి వస్తు సామగ్రితో సహా అన్ని రకాల ధరలను రెట్టింపు చేసి ఇక్కడి వ్యాపారులు అడ్డంగా దోచుకుంటున్నారు. అయినప్పటికీ వీరిపై ఏ ఒక్కశాఖ అధికారులు కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వెంకటాపురం గ్రామం నుంచి ప్రారంభమై.. కైలాస ద్వారం వరకు భక్తులు దోపిడీకి గురవుతూనే ఉంటారు.

మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం

కాలినడకన వచ్చే భక్తులకు గత ఏడాది కంటే మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. ఇప్పటికే ఆయా ప్రాంతాలను పరిశీలించాం. భీముని కొలను మార్గంలో 8 చోట్ల నీటి సదుపాయాన్ని కల్పిస్తాం. పాదయాత్రికులు నడిచి వెళ్లేందుకు వీలుగా జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేయించాం. నాగలూటి, పెచ్చెర్వు ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేయిస్తాం. ప్రత్యేకించి పాదయాత్రగా వచ్చిన భక్తులకు మార్గమధ్యంలో కంకణాలు ఇచ్చి వారికి త్వరగా దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

- ఎస్‌.లవన్న, శ్రీశైల దేవస్థానం ఈవో

Updated Date - 2023-02-13T12:20:32+05:30 IST