ఇక్కడ తేళ్లు కుట్టవు

ABN , First Publish Date - 2023-09-04T23:50:24+05:30 IST

భక్తులు కాలినడక కొండ్రాయి కొండపైకి చేరుకొని కొండలరాయుడికి తేళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఇక్కడ తేళ్లు కుట్టవు

కోడుమూరు, సెప్టెంబరు 4: భక్తులు కాలినడక కొండ్రాయి కొండపైకి చేరుకొని కొండలరాయుడికి తేళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైకి భక్తులు సోమవారం పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆలయం ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. భక్తులు కొండపై కనిపించే రాళ్ల కింద ఉన్న తేళ్లను పట్టుకొని స్వామి విగ్రహంపై వదిలేసి పూజలు చేపట్టారు. తేళ్లను నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి వింత ఆచారం. ఇక్కడ ఆ వింత ఆచారాన్ని తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. వర్షం జల్లులను కూడా లెక్క చేయకుండా స్వామి దర్శనం కోసం కొండపైకి వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

భక్తితో ఏ రాయిని కదిపినా తేళ్ల దర్శనం

ప్రతి ఏడాది శ్రావణ మాసం మూడో సోమవారం కొండపై వెలసిన కొండలరాయుడు (వెంకటేశ్వర స్వామి) కోసం భక్తులు కాలి నడకన కొండలు దాటు కొంటూ ఎతైన కొండకు చేరుకుంటారు. ఈ కొండను భక్తులు కొండ్రాయి కొండ అని పిలుస్తారు. పిల్లలు, పెద్దలు కాలినడకన వచ్చి కొండపై ఉన్న కొండలరాయుడిని దర్శించుకుంటారు. దర్శనంకు ముందు భక్తులు భక్తితో స్వామిని మనస్సులో తలచుకొని కొండపై ఉన్న ఏ రాయిని కదిపినా తేళ్లు దర్శనం ఇస్తాయి. దర్శనం ఇచ్చిన తేళ్లను చేతిలోకి తీసుకొని వాటికి దారం కట్టి స్వామికి నైవేద్యంగా విగ్రహంపై వదిలేస్తారు. ఇక్కడ లభించే తేళ్లు భక్తులకు ఎలాంటి హాని చేయకపోవడం ఇక్కడ వింత విశేషంగా చెప్పుకుంటారు. తేళ్లను పిల్లలు కూడా పట్టుకోవడం మరో విశేషం.

Updated Date - 2023-09-04T23:50:24+05:30 IST