రూ. 500 కిట్లు పంచి రూ.10 వేలంటూ ప్రచారం
ABN , First Publish Date - 2023-09-07T23:59:12+05:30 IST
కనీసం రూ 500 విలువ చేయని విత్తనాల కిట్లను రూ. 10.000 అంటూ వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని పలువురు దళిత రైతులు వాపోయారు.
నందికొట్కూరు రూరల్ సెప్టెంబర్ 3 : కనీసం రూ 500 విలువ చేయని విత్తనాల కిట్లను రూ. 10.000 అంటూ వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని పలువురు దళిత రైతులు వాపోయారు. గురువారం నాడు స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్ద జిల్లా షెడ్యూల్ కులాల సేవాసహకార సంఘం ఆధ్వర్యంలో జెడ్‌బీఎన్‌ఎఫ్ పథకం కింద అంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫామ్ కింద రైతులకు ఉచితంగా వివిధ రకాల విత్తనాలు ఉండే కిట్లను ఎమ్మెలే ఆర్థర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కిట్లను రైతులు అనుమానం వచ్చి విప్పి చూడగా అందులో వేరుశనగకాయలు అరకిలో, కందులు అరకిలో, అలాగే పెసులు, శనగలు, జొన్నలు, సన్‌ఫ్లవర్, రాగులు, తోపాటుగా మరికొన్ని విత్లనాల ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి. వీటి విలువ లెక్కవేయగా రూ 500 కూడా చేయవని రైతులు వాపోతున్నారు. ఒక రోజు కూలీ వదులుకొని కొత్తపల్లె, జూపాడుబంగ్లా మండలాల నుంచి వచ్చామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విత్తనాలను కేవలం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న షెడ్యూల్ కులాల రైతులకు మాత్రమే అందించే విధంగా కేంద్ర ప్రభుత్వ ఏజేఏవై పథకం అంటూ బ్యాగ్ పై ముద్ర కూడా ఉండడం గమనార్హం. వీటిని రూ 10,000 అంటూ ప్రత్యేక బ్యానర్లు ముద్రించి రైతులను మభ్యపెట్టడం ఎంతవరకు సమసంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.