రూ.12 లక్షలు స్వాహా..!
ABN , First Publish Date - 2023-05-27T00:16:14+05:30 IST
మండలంలో 2015లో పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన రాంబాబు రూ.12 లక్షల సొమ్మును కాజేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.

పంచాయతీ కార్యదర్శి చేతివాటం
నకిలీ బిల్లులతో పన్నులు వసూలు
ప్రభుత్వానికి జమ చేయని వైనం
హొళగుంద, మే 26: మండలంలో 2015లో పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన రాంబాబు రూ.12 లక్షల సొమ్మును కాజేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బిల్లులు ఇచ్చి ఇంటి, నీటి పన్నులతోపాటు వేలంపాట ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వాహా చేశాడని తెలుస్తోంది. హొళగుంద మేజర్ గ్రామ పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శిగా 2015లో రాంబాబు బాధ్యతలు చేపట్టాడు. అప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంబాబు గ్రామ పంచాయతీని అవినీతికి అడ్డాగా మార్చుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు నాలుగేళ్లపాటు ఇన్‌చార్జి కార్యదర్శిగా కొనసాగిన సమయంలో నకిలీ బిల్లులు సృష్టించి ఇంటి, నీటి పన్నులు, వేలం పాటల ద్వారా వచ్చిన రూ.12 లక్షల సొమ్మును కాజేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై గత ఏడాది ఆగస్టులో డీఎల్‌పీవో నూర్జహాన్ విచారణ చేపట్టగా అవినీతి బట్టబయలైనట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన ఉన్నత స్థాయి అధికారులు రాంబాబును విచారించి తిన్న సొమ్మును కట్టించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే రాంబాబుకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడం వల్లే చర్యలు తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. డీఎల్‌పీవో నూర్జహాన్‌ను వివరణ కోరగా రూ.12 లక్షల మేర ప్రభుత్వానికి కట్టవలసిన రికార్డులు కనిపించడం లేదని, దీంతో రాంబాఉకు నోటీసులు ఇచ్చామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇదే విషయంపైరాంబాబును వివరణ కోరగా ఆదోని డీఎల్‌పీవో నుంచి తనకు నోటీసులు వచ్చాయని, ఆరోగ్యం బాగా లేకపోవడంతో విచారణకు హాజరు కాలేదని, తన వద్ద ఆ సొమ్ముకు సంబంధించిన రికార్డులు మొత్తం ఉన్నాయని తెలిపారు.