గణతంత్ర దినాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2023-01-18T00:23:11+05:30 IST
భారత గణతంత్ర దినాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు.
నంద్యాల టౌన్, జనవరి 17: భారత గణతంత్ర దినాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గణతంత్ర దినోత్సవ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ రఘువీర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ బొమ్మలసత్రం వద్దనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, వేదిక బ్యాక్‌గ్రౌండ్, సిట్టింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో, పోలీసు అధికారులను ఆదేశించారు. వేడుకల్లో అధికారులకు కేటాయించిన విధుల్లో లోటుపాట్లు లేకుండా పక్కగా నిర్వహించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. దేశభక్తి ఉట్టిపడేలా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వ్యవసాయం, డీఆర్‌డీఏ, హౌసింగ్, వైద్యం, డ్వామా తదితర శాఖలు కార్యక్రమాలపై ఏర్పాటు చేయనున్న శాకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరిని ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కూడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల జారీకి జాబితా పంపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో పుల్లయ్య, అడిషనల్ ఎస్పీ రమణ, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాణ్యం పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. గవర్నర్ పర్యటనపై ఎస్పీ రఘువీర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాణ్యం మండలంలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఏపీ గిరిజన బాలికల పాఠశాలలో గిరిజనులతో గవర్నర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖాముఖి కార్యక్రమంలో దాదాపు 1500మంది గిరిజనులు పాల్గొననున్నారని, ఈ మేరకు మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. ఐటీడీఏ, డీఆర్‌డీఏ, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని గిరిజన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.