పెంచేశారు..!

ABN , First Publish Date - 2023-06-02T23:53:38+05:30 IST

పెంచేశారు..!

పెంచేశారు..!

భూముల మార్కెట్‌ విలువ 20-60 శాతానికి పెంపు

కర్నూలు, కల్లూరులో పలు వార్డుల్లో 90-100 శాతం

స్థిరాస్తుల కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం

అదనపు భారం రూ.49.93 కోట్లు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సవరణ (స్పెషల్‌ రివిజన్‌) పేరుతో భూముల మార్కెట్‌ విలువను ప్రభుత్వం భారీగా పెంచేసింది. ఆదాయం వచ్చే గ్రామాలు, వార్డులు లక్ష్యంగా ప్రజలపై భారం మోపింది. భూములు, స్థిరాస్తుల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో జేబుకు చిల్లు తప్పడం లేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్థిరాస్తి వ్యాపారి ఒకరు వాపోయారు. జిల్లాలో 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. 98 గ్రామాలు, 173 వార్డుల పరిధిలోని వ్యవసాయ, వాణిజ్య, నివాస ప్రాంతాల్లో భూములు, స్థిరాస్తుల మార్కెట్‌ విలువ 20-60 శాతం పెంచేశారు. ఫలితంగా కొనుగోలుదారులపై దాదాపు రూ.49.33 కోట్ల అదనపు భారం పడుతోంది.

జిల్లాల్లో కర్నూలు, కల్లూరు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆస్పరి, గూడూరు, కోడుమూరు, కోసిగి, పత్తికొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో స్థిరాస్తి, భూములు, వాణిజ్య భవనాలు రిజిస్ట్రేషన్ల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.406.46 కోట్ల ఆదాయం రాబట్టాలని టార్గెట్‌ విధించారు. రూ.307.10 కోట్లు వసూలు చేశారు. 2023-24లో భూములు కొనుగోలుదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సవరణ-2023 (స్పెషల్‌ రివిజన్‌) పేరుతో మార్కెట్‌ విలువ భారీగా పెంచింది. అందుకు అనుగుణంగా జిల్లాలో 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రూ.455.79 కోట్లు రిజిస్ట్రేషన్‌ చార్జీలు వసులు చేయాలని లక్ష్యాలను నిర్ధేశించారు. అంటే.. గతేడాదితో పోలిస్తే ఆస్తులు, భూములు కొనుగోలుదారులపై రూ.49.33 కోట్ల అదనపు భారం తప్పడం లేదు. వాస్తవంగా ప్రతి ఏటా ఆగస్టులో భూముల రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ ప్రభుత్వం పెంచుతుంది. ఖరీఫ్‌కు ముందు గ్రామాల్లో రైతులు భూములు క్రయ విక్రయాలు చేస్తారు. రైతుల జేబులకు చిల్లు పెట్టి ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్‌ రివిజన్‌ అస్త్రాన్ని సంధించింది.

కొనుగోళ్లపై నిరాసక్తత

జూన్‌ ఒకటో తారీఖు నుంచి భూములు ధరలు పెరగడంతో ఆస్తుల క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం పడనుంది. జనాలు కొనుగోళ్లపై పెద్దగా ఆసక్తి చూపే అవకాశం ఉండదు. శుక్రవారం కర్నూలు, కల్లూరు, ఆదోని, ఎమ్మిగనూరు సబ్‌ రిజిస్త్రార్‌ కార్యాలయలు వద్ద రిజిస్ట్రేషన్ల తీరును పరిశీలిస్తే ఆయా కార్యాయాలు వెలవెలబోయి కనిపించాయి. జూన్‌ ఒకటో తారీఖు నుంచి భూముల మార్కెట్‌ విలువ పెరుగుతుందని ముందస్తు సమాచారంతో చాలా మంది డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకొని మే నెలలోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు. దీంతో కొత్తగా కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్లకు ఆసక్తి చూపడం లేదు. మే 31న కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో 220 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగితే శుక్రవారం 90 మాత్రమే జరిగాయి. జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.

ఇష్టారాజ్యంగా పెంపు

జిల్లాల్లో వివిధ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో స్పెషల్‌ రివిజన్‌-2023 ప్రకారం 30 శాతం వరకు స్థిరాస్తులు, భూములు రిజిస్ట్రేషన్‌ విలువ పెంచేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 40 శాతం వరకు పెంచుకునేందుకు జీవోలు సూచించారని డాక్యుమెంట్‌ రైటర్లు పేర్కొంటున్నారు. ఇందుకు విరుద్ధంగా జిల్లా సబ్‌ అధికారులు ఇష్టారాజ్యంగా పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు రూరల్‌ మండలం బి. తాండ్రపాడు, దిన్నెదేవరపాడు గ్రామాల్లో చదరపు గజం భూమి విలువ రూ.1,800 నుంచి రూ.3,500 పెంచేశారు. అంటే 93 శాతం పెంచేశారు. గార్గేయపురం, రుద్రవరం రూ.1,500 నుంచి రూ.2,800 పెంచేశారు. 85-90 శాతం పెంచారు. పసుపుల గ్రామంలో రూ.1,600 నుంచి రూ.3 వేలు, మునగాలపాడు గ్రామంలో రూ.1,700 నుంచి రూ.3 వేలు, మామిదాలపాడులో రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. కల్లూరు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో కూడా ఇదే తరహాలో పెంచేశారని అంటున్నారు. అంతేకాదు.. పెంచి ధరలను సూచిస్తూ నోటీసు బోర్డు పెట్టాల్సి ఉండగా ఎక్కడా కూడా అలాంటిది కనిపించలేదు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో

ధరలు పెరిగిన గ్రామాలు, వార్డులు

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు వార్డులు గ్రామాలు

ఆదోని 12 14

ఆలూరు 4 10

ఆస్పరి 8 6

గూడూరు 15 4

కోడుమూరు 28 9

కోసిగి 9 14

కల్లూరు 4 10

కర్నూలు 17 6

ఓర్వకల్లు 6 7

పత్తికొండ 52 8

ఎమ్మిగనూరు 18 10

మొత్తం 173 98

కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం విలువ

ప్రాంతం/సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు పాత కొత్త

బి.తాండ్రపాడు (కర్నూలు) 1,800 3,500

దిన్నెదేవరపాడు (కర్నూలు) 1,800 3,500

గార్గేయపురం (కర్నూలు) 1,500 2,800

రుద్రవరం (కర్నూలు) 1,500 2,800

పసుపుల (కర్నూలు) 1,600 3,000

మునగాలపాడు (కర్నూలు) 1,700 3,000

మామిదాలపాడు (కర్నూలు) 6,000 10,000

కర్నూలు 45 వార్డు 15,000 25,000

76,77,87 వార్డులు (కల్లూరు) 18,000 25,000

86 వార్డు (కల్లూరు) 7,500 10,000

ఎమ్మిగనూరు గుడేకల్లు రోడ్డు 1,000 1,500

ఎమ్మిగనూరు శిల్పా ఎస్టేట్‌ 3,700 5,000

ఎమ్మిగనూరు బైపాస్‌ రోడ్డు 15,000 16,000

మండిగిరి (ఆదోని) 3,000 4,500

భూముల విలువ పెంచడం అన్యాయం

భూమి రిజిస్ట్రేషన్‌ కోసం మే 28వ తేదీ నుంచి ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. రిజిస్ట్రేషన్‌ చేయలేదు. తాజాగా చదరపు గజం రూ.2,500 నుంచి రూ.4,500కు పెంచేశారు. గజానికి రూ.2 వేలు పెరిగింది. పొలం అమ్ముకుందామంటే పెరిగిన భూముల ధరలు కారణంగా ఆర్థిక భారం తప్పడం లేదు. ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలి.

- రాజు, కల్లుకుంట గ్రామం, పెద్దకడుబూరు మండలం

అదనపు భారం పడుతోంది

ఆలూరు పట్టణ శివారులో మా అమ్మ నాగమ్మ పేరున నాలుగు ఎకరాల భూమి ఉంది. నా పేరున రిజిస్ట్రేషన్‌ చేయిద్దామని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వస్తే ఎకరాపై రూ.50 వేలు పెరిగిందని అన్నారు. ఈ లెక్కన నాలుగు ఎకరాలకు రిజిస్ర్టేషన్‌ రుసుం చలానా రూపంలో రూ.14 వేలు అదనపు భారం తప్పడం లేదు. ఏటా ధరలు పెంచుకుంటూపోతే ఎలా?. సామాన్యులు రిజిస్ట్రేషన్‌ భారం భరించలేక అగ్రిమెంట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వస్తోంది.

- చంద్రశేఖర్‌, ఆలూరు

Updated Date - 2023-06-02T23:53:48+05:30 IST