రవ్వలకొండలో రాబంధులు
ABN , First Publish Date - 2023-05-21T00:20:52+05:30 IST
కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నడియాడిన రవ్వలకొండలో బంధువుల పేర్లతో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మైనింగ్ మాఫియాకు తెరతీశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన నేలపై వైసీపీ కన్ను
మైనింగ్ పేరిట మాఫియా
ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై నారా లోకేశ్ ధ్వజం
కిక్కిరిసిన రహదారులు
బనగానపల్లెలో పోటెత్తిన జనం
బనగానపల్లె, మే 20: కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నడియాడిన రవ్వలకొండలో బంధువుల పేర్లతో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మైనింగ్ మాఫియాకు తెరతీశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అక్రమ మైనింగ్ చేసి బ్రహ్మంగారు నడయాడిన ప్రాంతాన్ని చేరిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రవ్వలకొండ వద్ద తన బంధువు పేరుతో ఒకచోట అనుమతి తీసుకుని మరోచోట మైనింగ్ చేయడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ 105వ రోజు శనివారం 16.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు 1346.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. బనగానపల్లె మండలం కైప శివారు విడిది కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమైంది. బనగానపల్లె పట్టణంలోకి పాదయాత్ర రాగా నారా లోకేశ్‌కు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ, వారి కుటుంబ సభ్యులు, మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. యువకులు కేరింతలు కొడుతూ బాణసంచా పేల్చుతూ హోరెత్తించారు. రాత్రి 9 గంటలకు గులాంనబిపేట వరకు సాగిన పాదయాత్ర రాత్రి 10 గంటలకు అమడాల విడిది కేంద్రానికి చేరుకుంది.