ఉగాది ఉత్సవాలకు సిద్ధం

ABN , First Publish Date - 2023-03-18T00:07:28+05:30 IST

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 19న ప్రారంభమై 23 వరకు జరగనున్నాయి.

 ఉగాది ఉత్సవాలకు సిద్ధం

భక్తులకు స్వామివారి అలంకార దర్శనమే

శ్రీశైలం, మార్చి 17: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 19న ప్రారంభమై 23 వరకు జరగనున్నాయి. ఐదు రోజులపాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు దేవస్థానం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. పాదయాత్రగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి ఇప్పటికే చేరుకున్నారు.

దర్శనం ఏర్పాట్లు: భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం (రూ. 200), అతిశీఘ్ర దర్శనం(రూ.500) కల్పించనున్నారు.

అన్నప్రసాద వితరణ: దేవస్థానం భక్తులకు అన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తుంది. అదేవిధంగా నాగులూటి, కైలాసద్వారం, క్షేత్ర పరిధిలో పలు చోట్ల కన్నడ భక్త బృందాలు, సేవాసంస్థలు అన్నదానం నిర్వహిస్తున్నాయి.

వైద్య శిబిరాలు: జిల్లా వైద్యశాఖ సహకారంతో భక్తులకు దేవస్థానం వైద్యసేవలు అందిస్తుంది. వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ద్వారా, కైలాసద్వారం, హఠకేశ్వరం, ఆలయ మహాద్వారం తదితర ప్రదేశాలలో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు వైద్యసేవలు అందించనున్నారు.

తాత్కాలిక వసతి: ఉగాది మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆరుబయట ప్రదేశాలలో పైప్‌ పెండాల్స్‌, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రపరిధిలోని శివదీక్షా శిబిరాలు, బాలగణేశ సదనం, మల్లమ్మ కన్నీరు, రుద్రాక్షవనం, ఆలయ మాఢవీధులు తదితర ఆరుబయలు ప్రదేశాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

మంచినీటి సరఫరా: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాక్షిగణపతి, హఠకేశ్వరం, కైలాసద్వారంతో పాటు క్షేత్రంలో పలుచోట్ల భక్తులు బసచేసే ప్రాంతాలకు వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు కైలాసద్వారం నుంచి భీమునికొలను మార్గమధ్యంలో 1000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులతో మంచినీరు అందిస్తున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు: భక్తులను అలరించేందుకు ఆలయ పుష్కరిణి, శివ దీక్షా శిబిరాల వద్ద కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామోత్సవంలో కోలాటం, చెక్కభజన, పగటివేషాలు, బుట్ట బొమ్మలు తదితర జానపద కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2023-03-18T00:07:28+05:30 IST