పెన్సిల్‌ కోడ్‌ పడాల్సిందే..

ABN , First Publish Date - 2023-07-20T23:52:46+05:30 IST

అక్కడ ప్రతి ఫైల్‌ మీద పెన్సిల్‌తో కోడ్‌ వేస్తారు. అదే ఆ ఫైల్‌ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కోడ్‌ పడితే ఫైల్‌ చకచకా నడుస్తుంది.

   పెన్సిల్‌ కోడ్‌ పడాల్సిందే..
ఆర్టీవో కార్యాలయం

లేకుంటే ఫైల్‌ ఆగినట్లే

ప్రతి పనికి ఓ రేటు

అధికారులు, దళారులు కుమ్మక్కు

అవినీతిమయంగా రవాణా శాఖ

ఆదోని, జూలై 20: అక్కడ ప్రతి ఫైల్‌ మీద పెన్సిల్‌తో కోడ్‌ వేస్తారు. అదే ఆ ఫైల్‌ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కోడ్‌ పడితే ఫైల్‌ చకచకా నడుస్తుంది. లేకపోతే ఆగిపోతుంది. ఎన్ని రోజులు తిరిగినా ఫలితం ఉండదు. ఎవ్వరు చెప్పినా ఆ పని పూర్తి కాదు. రవాణా శాఖ కార్యాలయంలో ఈ కోడ్‌ లాంగ్వేజ్‌కి ఉన్న విలువ మనుషులకు లేదు. అధికారులు, బ్రోకర్లు ముందే ఒక ఒప్పందానికి వచ్చి తమకే తెలిసిన కోడ్‌ భాషలో ఆఫీసును నడుపుతున్నారనే ఆరోపణ ఉంది.

డివిజన కేంద్రంలోని రవాణా కార్యాలయంలో దరఖాస్తు పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా, పని జరుగదు. ఇక్కడ అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లుతోంది. ప్రతిపనికి డబ్బులు ఒక రేటు ఉందని, ప్రతి పనికి ఒక కోడ్‌ ఉందని, అంతా దాని ప్రకారమే నడుస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఏపీ ఆర్టీవో నిబంధనల ప్రకారం పత్రాలను ఆనలైనలో నమోదు చేసుకొని నేరుగా కార్యాలయానికి వెళ్లినా పనులు జరగవు. వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు.

కోడ్‌ ఉంటేనే లోపలికి..:

రవాణా కార్యాలయంలోకి పోగానే ఎదురయ్యే అధికారి ‘‘మిమల్ని ఎవరు పంపారు...? మీ ఫైల్‌ ఎవరు తయారు చేశారు..?’’ అని అడుగుతారు. ఫైల్‌ వెనుక కోడ్‌ ఉందా..? లేదా...? అని నిర్థారణ చేసుకుని లోపలికి పంపుతారు. పెన్సిల్‌ కోడ్‌ లేదంటే అక్కడి నుంచి అక్కడే బయటికి పంపిస్తారు. అంటే ఫైలు గురించి ముందస్తుగా అధికారితో లావాదేవీలు జరిపి, గ్రీన సిగ్నల్‌ పొందితే తప్ప ఫైల్‌ కదలదు. ఒకవేళ దరఖాస్తుదారుడు నేరుగా వచ్చామని, నిబంధనల ప్రకారమే ఆనలైనలో నమోదు చేసుకున్నామని చెప్తే, కోడ్‌ లేదు కాబట్టి దరఖాస్తు ఏదో ఒక కారణంతో పక్కకు పోతుంది. కింది ఉద్యోగులను గాడిలో పెట్టాల్సిన అధికారులే అవినీతికి పాల్పడితే సిబ్బంది సరైన మార్గంలో ఎలా నడుస్తారు....? అందుకే రవాణా శాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిపోయింది. వాహనదారులు లైసెన్స, వాహన రిజిస్ట్రేషన, పాత వాహనాలకు నెంబర్లు ఇలా ఏ పనులు చేయించుకోవాలన్నా వారు నేరుగా ఆర్టీవో కార్యాలయంలోకి వెళితే పనులు కావడం లేదు. డ్రైవింగ్‌ సరిగ్గా రాకపోయినా, వాహనాలు ఉండి లైసెన్సులు లేకపోయినా దళారుల వద్దకు పోయి వారు చెప్పిన ఫీజులు చెల్లిస్తే పనులు అయిపోతాయి.

అధికారుల కనుసన్నల్లోనే....!!

అవినీతికి అలవాటు పడ్డ రవాణా శాఖ అధికారుల అక్రమ ఆదాయం రోజుకు కొన్ని లక్షల రూపాయలు పైమాటే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులే ఆఫీసు పరిసరాల్లోని ఓ ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా పనులు చక్కపెడుతున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. వారి స్థాయిని బట్టి వాటాలు పంచుకున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఈ లంచాల వ్యవహారం అటెండర్‌ నుంచి అధికారి వరకు యథేచ్ఛగా సాగుతుందనేది బహిరంగ రహస్యమే... అయినప్పటికీ అధికారుల అక్రమ దందాపై శాఖాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనర్హం.

అడిగినంత ఇవ్వాల్సిందే...

రవాణా శాఖలో వాహనదారులకు లైసెన్సలు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ తదితర అవసరాల కోసం ఆనలైన సేవలు అందుబాటులో ఉన్నాయి. కాని ఏజెంట్ల ద్వారా వెళ్తేనే ఎలాంటి పనైనా వెంటనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఏజెంట్‌ అడిగినంత ముట్టజెప్పాల్సిందే. వీటికి తోడు వాహనాల ఫిట్‌నెస్‌లు, పేర్ల మార్పిడి, ఓవర్‌ లోడ్‌ వెహికల్స్‌కు ఫైనలు పేరిట అదనంగా గుంజుతూనే ఉన్నారనే ఆరోపణలు లేకపోలేదు.

అందరికి ఇవ్వాలి కదా మరి....

జిల్లాలో ఇసుక, ఎర్రమట్టి తరలించే లారీలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. లారీలు ఓవర్‌ లోడ్‌తో ప్రయాణిస్తున్నందున రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిని నివారించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించాలి. కానీ లారీ యజమానుల నుంచి నెలవారి మామూళ్లు తీసుకొని నామ మాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. రవాణా శాఖలో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా ఉండేందుకు గాను ఆయా వర్గాలను మెసేజ్‌ చేస్తున్నారనే ప్రచారమూ లేకపోలేదు. జిల్లాలో ఉన్న కొంతమంది అధికారులకు, ప్రజాప్రతినిఽధులకు నెలవారి మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమాలు జరగడం లేదు - నాగేంద్ర, ఆర్టీవో, ఆదోని

అక్రమాలు ఏమి జరగడం లేదు. అంతా ఆనలైన అయ్యింది కాబట్టి ఒక్క పైసా కూడా ఎవ్వరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే నా దృష్టికి తీసుకురావచ్చు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాను.

Updated Date - 2023-07-20T23:52:46+05:30 IST