Share News

ఇక పసిడి పంటలే..!

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:00 AM

ఇక పసిడి పంటలే..!

ఇక పసిడి పంటలే..!

ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలు

ప్రాథమిక నిర్ధారణకువచ్చిన అధికారులు

మరోసారి సర్వే చేపట్టనున్న జీఎ్‌సఐ బృందం

ఆనందంలో ఆయా గ్రామాల ప్రజలు

ఆదోని, డిసెంబరు 16 : వర్షం వస్తే తప్ప వ్యవసాయ దిగుబడులు చేతికి రాని ఆ భూముల్లో బంగారు పంటలు పండనున్నాయి. నిత్యం క్షామంతో అల్లాడిపోయే గ్రామాల ప్రజల జీవితాల్లో పసిడి వెలుగులు ప్రసరించనున్నాయి. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎ్‌సఐ) ఇదే స్పష్టం చేస్తోంది. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామం వజ్రాలకు పెట్టింది పేరుగా నిలవగా అదే కోవలోకి ఆస్పరి మండలం వచ్చి చేరనుంది. ఈ మండలంలోని చిరుమాన్‌దొడ్డి, అట్టేకల్లు గ్రామాలతోపాటు మరో ఐదు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జీఎస్‌ఐ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) బృందం సర్వే నిర్వహించి బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. అధికారులు మరోసారి సర్వే చేపట్టి నిక్షేపాల వెలికితీతగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

జీఎ్‌సఐ సర్వే వివరాలు వెల్లడి

రాయల కాలంలో వజ్ర వైడూర్యాలను రాశులుగా పోసి అమ్మేవారని అంటారు. ఇందుకు నిదర్శనంగానే కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు, వజ్రాలు బయటపడుతున్నాయి. తొలకరి జల్లులు కురిస్తే చాలు పంట పొలాల్లో వజ్రాల కోసం జనాలు వేట మొదలు పెడతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అన్వేషణ సాగిస్తుంటారు. ఇందుకు తుగ్గలి మండలం జొన్నగిరి కేంద్రంగా మారింది. దీనికితోడు ఆస్పరి మండలంలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయని జియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎ్‌సఐ) ప్రాథమికంగా నిర్ధారించింది. మూడు రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర జియోలాజికల్‌ బోర్డు సమావేశంలో కర్నూలు జిల్లా భూగర్భ గనుల శాఖ డీడీ రాజశేఖర్‌, నంద్యాల జిల్లా ఏడీ రామచంద్రకు సర్వేకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

చిరుమాన్‌దొడ్డి, అట్టేకల్లు గ్రామాల్లో..

ఆస్పరి మండలం చిరుమాన్‌దొడ్డి, అట్టేకల్లు గ్రామాలతోపాటు మరో ఐదు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఇటీవల జీఎ్‌సఐ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) బృందం సర్వే నిర్వహించింది. ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. మూడు రోజుల క్రితం విజయవాడలో జరిగిన జీఎ్‌సఐ రాష్ట్ర బోర్డు సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని, ఈ నిక్షేపాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. వీటి నాణ్యత ఏ మేరకు ఉంటుంది అనే అంశంపై చర్చ జరిగింది. దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరినట్లు తెలుస్తోంది. త్వరలో మరోసారి ఆస్పరి మండలంలో జీఎ్‌సఐ బృందాలు పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుండగా పగడిరాయి గ్రామ శివారులో బంగారు గనులు ఉన్నట్లు గుర్తించి పసిడిని వెలికి తీస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న విషయాన్ని జీఎ్‌సఐ బృందం బయట పెట్టడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పంట పొలాలకు డిమాండ్‌..

బంగారు నిక్షేపాలకు సంబంధించి వివిధ అంశాలపై సమగ్రంగా సర్వే చేయాలని జీఎస్‌ఐ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిక్షేపాలను సైతం సరిగా గుర్తించే విధంగా ప్రత్యేక చొరవ చూపనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే తుగ్గలి మండలంలో కూడా బంగారు నిక్షేపాల కోసం సర్వే పనులు ప్రారంభించి తవ్వకాలు కూడా జరుపుతున్నారు. తాజాగా ఆస్పరి మండలంలో గనులు ఉన్నట్లు గుర్తించడంతో ఆయా ప్రాంతంలోని పంట పొలాల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. జొన్నగిరి ప్రాంతంలో ఉన్న పగిడిరాయి గ్రామంలో 2024 నాటికి పూర్తి స్థాయిలో బంగారు ఉత్పత్తిని ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి అవసరమైన అనుమతులను 2013లోనే ఓ ప్రైవేట్‌ సంస్థ దక్కించుకుంది. ఆస్పరిలో ఉన్న నిక్షేపాలను పూర్తి స్థాయిలో పరిశోధన చేశాకే అనుమతులు తీసుకురు అవకాశం ఉంది. ఆ తరువాత అవసరమైన పంట పొలాలను లీజుకు తీసుకునే విధంగా చర్యలు చేపట్టనున్నారు. బంగారు ఉన్నట్లు పూర్తి స్థాయిలో సర్వే చేయడానికి కనీసం పదేళ్ల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జీఎ్‌సఐ అధికారులు గుర్తించడంతో మండలం స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది.

Updated Date - Dec 17 , 2023 | 12:00 AM