వేలిముద్ర వేసేదిలేదు..!

ABN , First Publish Date - 2023-08-03T23:16:10+05:30 IST

నంద్యాల మున్సిపాలిటీలో ఓ కీలక అధికారి నేనింతేనంటూ వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగులు విసిగిపోతున్నారు.

   వేలిముద్ర  వేసేదిలేదు..!
నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం

నంద్యాల మున్సిపాలిటీలో ఓ అధికారి జులుం

సచివాలయ సిబ్బందిపై ప్రతాపం

450 మందికి అందని ఇంక్రిమెంట్‌

బదిలీపై వెళ్ళిన వారికి ఎస్‌ఆర్‌ ఇవ్వకుండా వేధింపులు

గ్రీవెన్సలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలేవీ?

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌..!

నంద్యాల టౌన, ఆగస్టు 3: నంద్యాల మున్సిపాలిటీలో ఓ కీలక అధికారి నేనింతేనంటూ వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగులు విసిగిపోతున్నారు. ‘నేను చెప్పిందే జరగాలి..’ అన్న మొండిపట్టుతో ఉన్న అధికారి ఉద్యోగుల పాలిట మోనార్క్‌గా మారారు. ఆ అధికారి తీరుతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 43 వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో కూడిన జీతం నిలిచిపోయింది. సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో కూడిన జీతం రావాలంటే కీలక అధికారి తన వేలిముద్ర బయోమెట్రిక్‌ వేసేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ‘మీరు ఏం పని చేస్తున్నారని ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి..’ అంటూ సదరు అధికారి సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కార్యాలయ వర్గాల ద్వారా సమాచారం. అంతేకాకుండా అసభ్య పదజాలంతో చీదరించుకుంటున్నాడని కొంతమంది సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

నా పనిలిముద్ర వేయడమేనా..!

నంద్యాల పురపాలక సంఘం పరిధిలో మొత్తం 42 వార్డులకు గాను 42 సచివాలయాలు, మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న సచివాలయంతో మొత్తం 43 సచివాలయాలు ఉన్నాయి. దాదాపు 500 మందిదాకా సచివాలయాల సిబ్బంది ఉన్నారు. 2019లో రిక్రూట్‌ అయిన సచివాలయాల సిబ్బందికి ఆగస్టు ఒకటో తేదీన ఇంక్రిమెంట్‌తో కూడిన కొత్త జీతం రావాల్సి ఉంది. కొత్త జీతం రావాలంటే డీడీఓ పవర్‌లో ఉన్న అధికారి మొత్తం సచివాలయాల సిబ్బందికి విడివిడిగా బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంది. ఒకటో తేదీకి జీతం రావాలంటే గడిచిన నెలలో 20 నుంచి 30వ తేదీ మధ్యన జీతాలకు సంబంధించిన మొత్తం వివరాలను ఆనలైనలో సబ్‌ట్రెజరీకి పంపాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఇంక్రిమెంట్లకు సంబంధించి వివరాలు నమోదు చేస్తూ అధికారికంగా డీడీఓ పవర్‌లో ఉన్న అధికారి తన వేలిముద్రను పొందుపరుస్తూ అనుమతికి గ్రీన సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నంద్యాల మున్సిపాలిటీలో ఓ కీలక అధికారి వేలిముద్ర వేయడమే నా పని అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నాడని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. దాదాపు 500 మంది సచివాలయాల సిబ్బందికి ఇంక్రిమెంట్లతో కూడిన జీతం నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో తమ సహచరులు ఇంక్రిమెంట్‌తో కూడిన జీతాన్ని తీసుకుంటుంటే ఇక్కడేమో వేలిముద్ర వేయకుండా తమను చిన్నచూపుతో ఆ అధికారి వ్యవహరిస్తున్న తీరుతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని స్థితిలో సచివాలయాల సిబ్బంది ఉన్నారు.

జూన జీతాలు ఆగస్టులో..!

2020 రిక్రూట్‌మెంట్‌లో నెలకు రూ.15 వేల జీతంతో సచివాలయాల్లో ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ ఏడాది జూన నుంచి పెరిగిన జీతం (నెలకు రూ.27 వేలు) రావాల్సి ఉంది. వీరికి కూడా మే నెల 20 నుంచి 30వ తేదీలోగా రెండవ బ్యాచ సచివాలయ ఉద్యోగులకు కొత్త జీతాల కోసం డీడీఓ పవర్‌లో ఉన్న అధికారి వేలిముద్ర వేయని కారణంగా కొత్త జీతాలు నిలిచిపోయాయి. ఈ విషయంపై ఉద్యోగులు పలు సార్లు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి డీడీఓ పవర్‌లో ఉన్న అధికారిని వేడుకోవడంతో ఎట్టకేలకు మూడు నెలలకు వేలిముద్ర వేశారు. దీంతో జూన, జూలై నెలల పెరిగిన జీతంతో కలిపి ఆగస్టులో తీసుకున్నారు. వేలిముద్ర వేయని కారణంగానే మూడు నెలలపాటు పెరిగిన జీతాలను తీసుకులేకపోయామని వార్డు సచివాలయాల సిబ్బంది వాపోతున్నారు.

అన్నింటికీ అడ్డకుంలే

మున్సిపాలిటీలో మోనార్క్‌లా నేనింతే అంటూ వ్యవహరిస్తున్న అధికారి తీరుతో సచివాలయాల సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. మెడికల్‌ బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులు, అరియర్స్‌కు కూడా వేలిముద్ర వేయకుండా వ్యవహరిస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక్కడ పని చేస్తూ బదిలీపై వెళ్ళిన వారికి వారి సర్వీస్‌ రికార్డులు, ఎల్‌పీసీలు కూడా ఆ అధికారి ఇవ్వకపోతుండటం కలకలం రేపుతోంది. ‘నేనే నా ఎస్‌ఆర్‌ చూసుకోలేదు.. నేను మీకు ఎస్‌ఆర్‌ ఇవ్వాలా..’ అంటూ బదిలీపై వెళ్లిన ఓ సచివాలయ ఉద్యోగికి సదరు మోనార్క్‌ అధికారి చెప్పిన సమాధానం ఉద్యోగ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

కలెక్టరైతే నాకేంటి.. నేనే బాస్‌...

వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం జూలై 21వ తేదీన కలెక్టరేట్‌లో ఉద్యోగులకు ప్రత్యేకంగా గ్రీవెన్సడేను నిర్వహించారు. సచివాలయాల ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వివిధ అంశాలతో కూడిన వినతిపత్రంలో ఇంక్రిమెంట్‌ ఇవ్వడం లేదన్న విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీలోని కీలక అధికారి ‘కలెక్టరైతే నాకేంటి.. నాకు నేనే బాస్‌..’ అని కొంతమందితో అన్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆగస్టు 1న ఇంక్రిమెంట్‌తో కూడిన జీతం వచ్చేందుకు అవసరమైన బిల్లుల అనుమతి కోసం ఆనలైనలో నమోదు చేయలేదు. దీంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళినా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇంక్రిమెంట్‌తో కూడిన జీతం పొందలేక నంద్యాల మున్సిపల్‌ వార్డు సచివాలయాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ గోడును ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి సదరు అధికారిని వివరణ కోరేందుకు పలుసార్లు ప్రయత్నించినప్పటికీ కార్యాలయంలో అందుబాటులో లేరు.

Updated Date - 2023-08-03T23:16:10+05:30 IST