గూడు కట్టుకున్న నిరాశ

ABN , First Publish Date - 2023-06-01T00:11:18+05:30 IST

ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరకనే చెప్పలేదు.

గూడు కట్టుకున్న నిరాశ

ఇళ్లు కట్టిస్తామని మాట మార్చిన ప్రభుత్వం

సర్కారు సాయం సరిపోక సాగని నిర్మాణాలు

స్థలాలు వెనక్కి తీసుకుంటామని ఒత్తిళ్లు

ఏం చేయలేని దీన స్థితిలో లబ్ధిదారులు

నాలుగేళ్లయినా పూర్తిగాని జగనన్న కాలనీలు

నంద్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి):

ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. అలాంటి కష్టాలే ఇప్పుడు జగనన్న కాలనీల లబ్ధిదారులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం మాట మార్చింది. లబ్ధిదారులే కట్టుకోవాలని చెప్పడంతో పేదల్లో తిరిగి నిరాశ గూడు కట్టుకుంది. మరోవైపు ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకుంటామంటూ ప్రభుత్వం బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో కొందరు అప్పులు తెచ్చి నిర్మాణాలను సాగిస్తుండగా మరికొందరు

స్థలాలను అమ్మేసుకుంటున్నారు.

జిల్లాలో ‘జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 43,553 ఇళ్లను ఆయా నియోజకవర్గాలకు మంజూరు చేసింది. వాగులు, వంకలు, గుట్టల్లో స్థలాలు ఇవ్వడంతోపాటు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు బేస్‌మెంట్‌ స్థాయి కూడా దాటనివి 12,410 ఉన్నాయి. ఇక బేస్‌మెంట్‌ లెవెల్‌ వరకు వచ్చిన నిర్మాణాలు 9,785, లెంటల్‌ లెవెల్‌ వరకు వచ్చినవి 2,561 ఉండగా, రూఫ్‌ లెవెల్‌ వచ్చినవి 962 వరకు ఉన్నాయి. ఇక అసలు మొదలుపెట్టని ఇంటి నిర్మాణాలు 925 ఉన్నాయి. ఈ లెక్కన మంజూరైన ఇళ్లకు సంబంధించి దాదాపు 26 వేలకు పైగా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.

ప్రభుత్వ సాయం అంతంతే..

ఉమ్మడి జిల్లాలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీల్లో లక్ష మందికి పైగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు మొదట మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడం, సామగ్రిని ఇవ్వడం, సామగ్రి సొంతంగా లబ్ధిదారులే తెచ్చుకుంటే వాటికి అయిన ఖర్చును బిల్లుల రూపంలో దశల వారీగా చెల్లించడం. అయితే ఇందులో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇచ్చే ఆప్షన్‌ను ఎక్కువ శాతం మంది ఎంచుకున్నారు. దీంతో ప్రభుత్వం మాట మార్చి ఇళ్లు కట్టించి ఇవ్వలేమని, నిర్మాణానికి 1.80 లక్షలు ఇస్తామని చెప్పింది. అవి సరిపోవని లబ్ధిదారులు వ్యతిరేకించడంతో డ్వాక్రా రుణాల ద్వారా మరో రూ.30 వేలు ఇవ్వడానికి నిర్ణయించింది. మొత్తం కలిపి రూ.2.10 లక్షలు అవుతున్నాయి. అయితే పెరిగిన స్టీలు, సిమెంటు, ఇసుక, కూలీల ఖర్చులతో లబ్ధిదారులకు నిర్మాణ భారం తడిచి మోపెడవుతోంది. బేస్‌మెంట్‌ లెవెల్‌ పూర్తి చేయడానికే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పావు వంతు కూడా ఇంటి నిర్మాణం పూర్తి కాదు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే అదనపు ఖర్చును బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుండగా బ్యాంకులు మాత్రం నిబంధనల పేరుతో లబ్ధిదారులకు చుక్కలు చూపుతున్నాయి.

చేతులు మారుతున్నాయా?

జగనన్న లే అవుట్‌ కింద కేటాయించిన స్థ లాన్ని లబ్ధిదారులు వేర వారికి అమ్మడానికి లేదని, ఎవరైనా కొనుక్కున్నా అది చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ హెచ్చ రికను ఖాతరు చేయకుండా ఆ స్థలా లను లబ్ధిదారుల వద్ద నుంచి కొంతమంది కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 శాతం స్థలాలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇల్లు కట్టుకునే స్థోమ త లేని పేదలు తమకు ఇచ్చిన స్థలాన్ని ప్రభు త్వం లాగేసుకుంటుందనే భయంతో అమ్మే సుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్ర భుత్వం స్పందించి పేదలకు ఇచ్చే సాయాన్ని మరింత పెంచాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

Updated Date - 2023-06-01T00:11:18+05:30 IST