ముగ్గులు పూసే.. ముచ్చట గొలిపే!
ABN , First Publish Date - 2023-01-09T01:02:46+05:30 IST
చుక్కల ముగ్గులు.. చూడచక్కని రంగులు..
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆధ్వర్యంలో పోటీలు
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
నంద్యాల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి), నంద్యాల, కల్చరల్: చుక్కల ముగ్గులు.. చూడచక్కని రంగులు.. వాటిలో అందమైన పువ్వులు, సంప్రదాయానికి ప్రతీక అయిన గొబ్బెమ్మలు వెరసి ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గులు మెరిశాయి. మహిళల చేతుల్లో మంత్రదండమేమైనా ఉందేమో అనిపించేలా, ఆకాశంలోని నక్షత్రాలు భూమి మీదకు దిగివచ్చాయా అనిపించేలా ముచ్చటైన ముగ్గులు అందరినీ అబ్బుర పరిచాయి. మహిళల్లోని ప్రతిభకు, సృజనాత్మకతకు వేదికగా ముగ్గుల పోటీలు నిలిచాయి. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆధ్వర్యంలో టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్.. డివైన్ ప్రాగ్రెన్స్ పార్టనర్ బెట్కో వారి అన్నమయ్య అగరువత్తులు.. హెల్త్ పార్టనర్ అమృతబిందు.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ మరియు సెల్సియా ఆధ్వర్యంలో స్టార్ డైరీ సౌజన్యంతో నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డులో ఆదివారం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకే మహిళలు పోటీల ప్రాంగణానికి చేరుకుని, తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తమకు కేటాయించిన బాక్సుల వద్దకు వెళ్లి రంగులు సిద్ధం చేసుకున్నారు. నిర్ణీత సమయానికి ముగ్గులు వేయడం మొదలుపెట్టి వివిధ రకాల రంగులతో అందంగా తీర్చిదిద్దారు. నంద్యాల జిల్లా పరిధిలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో 86 మంది పాల్గొన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు స్టార్ మిల్క్ డైరీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఆయన సతీమణి ప్రతిభ రూ.6,000తోపాటు 32 ఇంచుల కలర్ టీవీ, రూ.4,000తోపాటు మిక్సీ, రూ.3,000తోపాటు గ్రైండర్ అందజేశారు. వీరితోపాటు పది మందికి ప్రోత్సాహక బహుమతులుగా వంట కుక్కర్లను అందించారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి, ఆయన సతీమణి ప్రతిభ మాట్లాడుతూ మహిళలు సంక్రాంతి పండుగ సమయాల్లో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తుంటారని, వాటిల్లో వారి సృజనాత్మక శక్తి కనిపిస్తుందని, అలాంటి ప్రతిభను వెలికి తీసే పోటీల్లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖ చిత్రకారులు కోటేశ్, రంగనాథ్, కెప్టెన్ లలితా సరస్వతి మాట్లాడుతూ పాల్గొన్న అందరూ ముగ్గులను అందంగా వేశారని, మొదటి ముగ్గురిని ఎంపిక చేయడానికి కష్టపడాల్సి వచ్చిందని, బహుమతులు రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రజ్యోతి కర్నూలు బ్రాంచ్ మేనేజర్ లక్షణ్ మాట్లాడుతూ ముగ్గుల సంస్కృతిని ముందు తరాల వారికి అందించడానికి ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగ్గులు పోటీలు నిర్వహిస్తోందని, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని, ఉత్తమ ముగ్గులు వేసిన వారికి నగదు బహుమతితో పాటు ప్రత్యేక బహుమతులను కూడా అందిస్తున్నామన్నారు. అంతేగాకుండా జిల్లా స్థాయిలో మొదటి బహుమతి పొందిన వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు బ్యూరో ఇన్‌చార్జి గోరంట్ల కొండప్ప, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మురళీమోహన్‌రెడ్డి, నంద్యాల సెవెన్‌హిల్స్ ఆసుపత్రి అధినేత మారుతి కుమార్ పాల్గొన్నారు.
విజేతలు వీరే..
ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి రూ.6 వేలు, 32 ఇంచుల కలర్ టీవీ జి.లక్ష్మీ, ద్వీతీయ బహుమతి రూ.4 వేలు, మిక్సీ ఎ.జయంతి, తృతీయ బహుమతి రూ.3వేలు, గ్రైండర్ టి.నాగమణి గెలుచుకున్నారు. పది ప్రోత్సాహక బహుమతులను లక్ష్మీ రేణుక, జి.సునీత, ఎస్.కీర్తి, ఎ.లక్ష్మి, సుబ్బలక్ష్మి, డి.సరస్వతి, శిరిగిరి విజయలక్ష్మి, కే.మోహినీ వరలక్ష్మి, కిరణ్మయి, నీలవేణి గెలుచుకున్నారు. వీరికి అతిథులుగా విచ్చేసిన వారు బహుమతులను అందజేశారు.