ఎమ్మెల్యే వర్సెస్ హర్ష
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:49 PM
కోడుమూరు నియోజకవర్గంలోని వైసీపీలో వర్గ పోరు పెరిగిపోయి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పీఠాన్ని తాకింది.
సుధాకర్‌కు చెక్ పెట్టే పనిలో కుడా చైర్మన్
కొత్త వ్యక్తికి టిక్కెట్టు ఇప్పించేందుకు ప్రయత్నం
ముఖ్యమంత్రినే నమ్ముకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే
కోడుమూరు, డిసెంబరు 17: కోడుమూరు నియోజకవర్గంలోని వైసీపీలో వర్గ పోరు పెరిగిపోయి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పీఠాన్ని తాకింది. 2019 ఎన్నికల అనంతరం మూడు నెలలకే ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్, నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి మధ్య దూరం పెరిగిపోయింది. నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఏ పనులూ చేయకూడదని ఎమ్మెల్యేను కోట్ల హర్ష ఆదేశించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కోట్ల హర్ష ఆదేశాలను ఎమ్మెల్యే తిరస్కరించడం వల్లే వీళ్ల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని ప్రచారం జరుగుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఇరువైపుల నాయకులు కలిసి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నం పార్టీ పెద్దలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కోట్ల హర్ష వర్గీయులు ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు.
వర్గ పోరుతో అభివృద్ధి శూన్యం
ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్, కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి మధ్య నెలకొన్న వర్గ పోరు నియోజకవర్గంలో అభివృద్ధిని శూన్యం చేసింది. 2019 ఎన్నికల ప్రచారంలో కోట్ల, డాక్టర్ సుధాకర్ ప్రతి గ్రామంలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సుధాకర్ గెలిచిన అనంతరం వీళ్ల మధ్య నెలకొన్న విభేదాలు నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకంగా మారాయి. కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ మండలాల్లో తాగు, సాగు నీరు, రోడ్లు, కాల్వల సమస్యలు చాలా వరకు అలాగే ఉండిపోయాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా అటకెక్కింది. ముఖ్యంగా ఎల్లెల్సీ, జీడీపీ నీటి వాటా రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధిని మరిచి ఇసుక దోపిడీ, భూకబ్జాలు, పంచాయతీలతో ఆస్తులు కూడా బెట్టుకోవడంలో పోటీ పడుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చే ఆలోచనలో హర్ష
2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌కు చెక్ పెట్టే ప్రయత్నం కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి చేస్తున్నాడని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తన వర్గానికి చెందిన కొంత మందిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌కు కాకుండా తన వర్గానికి చెందిన వ్యక్తికి ఇప్పించే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే మణిగాంధీకి కోట్ల హర్ష గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే వైసీపీ మునిగిపోయే నావ అని భావించిన మణిగాంధీ టీడీపీలో చేరేందుకు దారులు వెతుక్కునే పనిలో పడినట్టు తెలుస్తోంది. మణిగాంధీ నుంచి ద్వారాలు ముసుకుపోవడంతో తెరపైకి ఎవరిని తీసుకురావాలా అనే ఆలోచనలో కోట్ల హర్ష ఉన్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి జగనే దిక్కు..
వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ను నమ్ముకొని పని చేసుకొంటూ వచ్చానని, తన భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉందని ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గడపను తొక్కి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లానని, తనకు జగన్ మోసం చేయరని పార్టీ శ్రేణులతో తన బాధను వ్యక్తపరుస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో తనకే టిక్కెట్టు వస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని కార్యకర్తలకు ధైర్యం నింపుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ ఒకరు చెప్తే టిక్కెట్టు ఇచ్చే వ్యక్తి కాదని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకే ఇస్తారని ఎమ్మెల్యే గట్టిగా నమ్ముతున్నారు. గడపగడప కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే రాష్ట్రంలో టాప్ 10లో ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు డాక్టర్ సుధాకర్‌కే వస్తుందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లోపం ఎవరిది..?
కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఏ ఎమ్మెల్యేతోనూ సఖ్యత పాటించడని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో ఎంతో శ్రమించి పోటీ చేసిన అభ్యర్థిని హర్ష గెలిపిస్తారు. ఆ వెంటనే గెలిపించిన ఎమ్మెల్యేతో విభేదిస్తాడన్న విమర్శలు ఉన్నాయి. కోట్ల కుటుంబానికి ఎంతో విధేయుడుగా ఉన్న ఎమ్మెల్యే ఎం.శిఖామణితో 2004లో కోట్ల హర్ష విభేదించారు. ఆ తరువాత 2009లో గెలిచిన ఎమ్మెల్యే మురళీకృష్ణతోనూ విభేదించారు. ఇప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌ను విభేదిస్తున్నారు. ఇందులో లోపం కోట్ల హర్షలో ఉందా లేక గెలిచిన ఎమ్మెల్యేల్లో ఉందా ప్రజలో ఆలోచించాలని ఎమ్మెల్యే సుధాకర్ వర్గీయులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ నమ్ముకొన్న వాళ్లకు టిక్కెట్టు ఇస్తారా ? లేక సిఫారసు చేసిన వ్యక్తులకు టిక్కెట్టు ఇస్తారా అన్నది వేచి చూడాలి.