రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్పీ
ABN , First Publish Date - 2023-01-18T00:20:30+05:30 IST
జిల్లాలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు.
చాగలమర్రి, జనవరి 17: జిల్లాలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం చాగలమర్రి పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2021 సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది నేరాల సంఖ్య చాలా వరకు తగ్గిందని అన్నారు. రహదారి ప్రమాదాలను పరిశీలిస్తే 14 శాతం తగ్గాయని చెప్పారు. జాతీయ రహదారులపై అధిక శాతం ప్రమాదాలు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటలలోపు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పార్ట్‌గా గుర్తించి ప్రజలకు అవగాహన కోసం సూచికలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 7 ఫ్యాక్షన్ గ్రామాలు ఉండగా ఆయా గ్రామాల్లో పోలీసు పికెటింగ్ కొనసాగుతుందని చెప్పారు. గ్రామాల్లో నాటు సారా, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు. పోలీసు స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫిర్యాది దారులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆయన వెంట ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, ఉయ్యాలవాడ ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఎస్‌ఐ జయంతి మేరి, పోలీసులు ఉన్నారు.