‘ధర్మ దీక్షను విజయవంతం చేయండి’

ABN , First Publish Date - 2023-01-15T00:26:50+05:30 IST

కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 18వ తేదీన నంద్యాలలో నిర్వహించబోయే రాయలసీమ ధర్మదీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.

‘ధర్మ దీక్షను విజయవంతం చేయండి’

నంద్యాల టౌన్‌, జనవరి 14 : కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 18వ తేదీన నంద్యాలలో నిర్వహించబోయే రాయలసీమ ధర్మదీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ధర్మదీక్ష ప్రచార కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాలే కాకుండా ప్రకాశం, నెల్లూరుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల ఆయకట్టులకు సక్రమంగా నీరు అందాలంటే కర్నూలు జిల్లాలో కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని డిమాండ్‌ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేని విశాఖలో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను సీమ ప్రజలు అంగీకరించడం లేదని అన్నారు. నంద్యాల కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించే రాయలసీమ ధర్మదీక్షను రైతులు, రైతుసంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి నాయకులు రామిరెడ్డి, రామసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, రాముడు, నిట్టూరు సుధాకర్‌రావు, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T00:26:55+05:30 IST