లోకేశ్‌ పాదయాత్ర ఆగదు

ABN , First Publish Date - 2023-01-26T00:27:38+05:30 IST

ఎన్నికుట్రలు పన్నినా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టే పాదయాత్ర ఆగదని ఆ పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

లోకేశ్‌ పాదయాత్ర ఆగదు

టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు

పాదయాత్రకు షరతులు విధించడం దారుణం

మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆగ్రహం

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 25: ఎన్నికుట్రలు పన్నినా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టే పాదయాత్ర ఆగదని ఆ పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పాదయాత్ర విజయవంతం కావాలని కోరతూ నగరంలోని ఆలయాల్లో టీడీపీ, అనుబంధ సంఘాల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఎన్‌టీయూసీ, బీసీ సెల్‌, ఐటీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహులు, సత్రం రామకృష్ణుడు, గట్టు తిలక్‌ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి టీజీ భరత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమిశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు యువత ఆశలను నెరవేర్చేందుకే లోకేశ్‌ ఈ పాదయాత్ర చేపట్టారని అన్నారు. టీజీ భరత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా ప్రజలు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక నిరాశ, నిస్పృహలతో ఆందోళన చెందుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పరమేష్‌, నంది మధు, మహేష్‌గౌడు, ప్రభాకర్‌, రమేష్‌, రామకృష్ణ, శివరాజప్ప, తదితరులు పాల్గొన్నారు.

ఆదోని: లోకేశ్‌ పాదయాత్రకు ప్రభుత్వం షరతులు విధించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మండిపడ్డారు. బుధవారం ఆదోనిలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పాదయాత్ర నేపథ్యంలో 27వ తేదీన ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంఘీభావంగా ఎన్టీఆర్‌ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర చేయాల్సింది రోడ్ల పైనే తప్ప పొలాల్లో కాదని, అనేక షరతులతో గీత దాటితే అనుమతులు రద్దు చేస్తాం అని చెప్పడం దారుణమని అన్నారు. లోకేశ్‌ పాదయాత్రకు 15 షరతులు విధించారని, ఇది రెండు కాళ్లు కట్టేసి, ఇక నడవండి అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసుల ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోరాదన్నారు. గతంలో ఏ పాదయాత్రకూ ఇలాంటి షరతులు విధించలేదని, ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందని అన్నారు. పోలీసుల పేరుతో షరతులు పెట్టి ఆటంకాలు కలిగించాలని చూసినా దానికి వెనుకడుగు వేసేది లేదని అన్నారు. బుద్దారెడ్డి, లక్ష్మీనారాయణ, తిమ్మప్ప, కల్లుబావి మల్లికార్జున, గోనబావి గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:27:38+05:30 IST