గణతంత్ర వేడుకలకు వేళాయే!

ABN , First Publish Date - 2023-01-26T00:07:42+05:30 IST

భారత గణతంత్ర దినోత్సవాలకు కందెనవోలు ముస్తాబవుతోంది.

  గణతంత్ర వేడుకలకు వేళాయే!

పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఘనంగా ఏర్పాట్లు

శకటాలు సిద్ధం చేస్తున్న వివిధ శాఖల సిబ్బంది

కర్నూలు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): భారత గణతంత్ర దినోత్సవాలకు కందెనవోలు ముస్తాబవుతోంది. కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే ఈ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్‌ కోటేశ్వరరావు బుధవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. శాఖల వారీగా బాధ్యతలు అప్పగించారు.

ఫ పోలీస్‌ పరెడ్‌ మైదానం సిద్ధం

కొండారెడ్డి బురుజు పక్కనే గల పోలీస్‌ పరెడ్‌ మైదానంలో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తారు. ఈమేరకు పరేడ్‌ మైదానాన్ని పోలీస్‌ యంత్రాంగం సిద్ధం చేసింది. కలె క్టర్‌ కోటేశ్వరరావు గురువారం ఉదయం 9 గంటలకు మువ్వన్నెల జెండా ఆవిష్కరించనున్నారు. జిల్లా నలమూల నుంచి వచ్చే వివిధ శాఖల అధికారులు, స్వాతంత్య్ర సమరయోదులు, ముఖ్య అతిఽథులు కూర్చోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. వివిధ శాఖల పనితీరును వివరిస్తూ స్టాల్స్‌, ప్రగతి శకటాలను ప్రదర్శించనున్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన తరువాత కలెక్టర్‌ కోటేశ్వరరావు పోలీస్‌ గౌరవ వందనం స్వీకరిస్తారు. పరెడ్‌ మైదానంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులతో పోలీస్‌ జాగిలాలతో తనిఖీలు చేశారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ ప్రతిభా పురస్కారాలు

జిల్లాలోని వివిధ శాఖల్లో గ్రామ, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పని చేసే అధికారులు, సిబ్బందికి ప్రతిభా పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఏడాది కాలంగా ఉద్యోగులు చేసిన సేవలు, విధుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. జిల్లాలో 155 మంది ఉద్యోగులు ప్రతిభ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకోనున్నారు.

ఫ కొండారెడ్డి బురుజుకు కొత్త కాంతులు

గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని కర్నూలు నగరానికి తలమానికమైన కొండారెడ్డి బురుజును విద్యుత దీపాలతో అలంకరించారు. ఇది పర్యాటకులను కనువిందు చేస్తోంది. రాత్రి వేళ విద్యుత కాంతులతో బురుజు మెరిసిపోతోంది.

Updated Date - 2023-01-26T00:07:43+05:30 IST