్ఞఅమ్మకానికి ఐటీఐ సీట్లు..!
ABN , First Publish Date - 2023-08-03T23:23:33+05:30 IST
అన్నీ అమ్మకాలు కొనగోళ్లే. డోన ప్రభుత్వ ఐటీఐలో సీట్లు కూడా అంతే. ఒక్కో సీటుకు ఒక్కో రేటు నిర్ణయించారు. సీట్లను అమ్మకానికి పెట్టి.. అందినంత దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
డిమాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30వేలు
మెరిట్ విద్యార్థులకు మొండి చేయి
చక్రం తిప్పిన వైసీపీ ప్రజాప్రతినిధి
నో మెరిట్.. క్యాష్ ఉంటేనే సీటు
ఐటీఐ కీలక అధికారి కనుసన్నల్లో తతంగం
డోన ప్రభుత్వ ఐటీఐలో నిర్వాకం
డోన, ఆగస్టు 3: అన్నీ అమ్మకాలు కొనగోళ్లే. డోన ప్రభుత్వ ఐటీఐలో సీట్లు కూడా అంతే. ఒక్కో సీటుకు ఒక్కో రేటు నిర్ణయించారు. సీట్లను అమ్మకానికి పెట్టి.. అందినంత దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. డిమాండ్‌ను బట్టి ఒక్కో సీటుకు ఒక్కో రేటు కట్టి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాలేజీలో నో మెరిట్.. క్యాష్ ఉంటేనే సీటు అనే విధానం అమలవుతున్నదని అంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే డోన ప్రభుత్వ ఐటీఐకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలక్ర్టీషియన, మోటారు మెకానిక్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, సివిల్, వెల్డర్, ఎలక్ర్టానిక్స్, టర్నర్, మెషనిస్టు ట్రేడ్‌లు ఈ కాలేజీలో ఉన్నాయి. అన్నిటిలో కలిసి 339 సీట్లు ఉన్నాయి. కళాశాలలో విద్యార్థుల తరగతి గదులు ఎంతో విశాలంగా ఉన్నాయి. సాంకేతిక విద్యకు అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇక్కడి ఈ కాలేజీలో సీట్ల భర్తీ కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది.
ఫ నిబంధనలు ఇవీ:
డోన ప్రభుత్వ ఐటీఐకి విద్యార్థులు ఆనలైనలో చేసిన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ప్రకారం సీట్లు భర్తీ చేయాలి. కళాశాలలోని 9 ట్రేడ్లలో.. కేవలం మూడు ట్రేడ్ల (ఎలక్ర్టిషన, డీజిల్ మెకానిక్, ఫిట్టర్)లకు సంబంధించి మేనేజ్‌మెంట్ కోటా కింద 20 శాతం సీట్లను భర్తీ చేసుకునే వీలు కల్పించారు. అయితే.. ప్రభుత్వ ఐటీఐలో సీట్ల భర్తీలో నిబంధనలను గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. ఐటీఐలోని కీలక అధికారి ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీని చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
ఫ అమ్మకానికి ఐటీఐ సీట్లు:
పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో సీట్ల భర్తీలో.. ‘ఫర్ సేల్’ అన్న ఫార్ములాను నడిపిస్తున్నట్లు విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం మెరిట్ విద్యార్థులకు సీట్లు కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎలక్ర్టీషియన, డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, సివిల్ ట్రేడ్లకు చాలా డిమాండ్ ఉంది. దీంతో డిమాండ్ ఉన్న ట్రేడ్లల్లో ఒక్కో సీటుకు రూ.20వేల నుంచి రూ.30వేలు వరకు రేటు నిర్ణయించినట్లు విమర్శలున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సీట్ల భర్తీలో చక్రం తిప్పుతున్నట్లు విమర్శలున్నాయి. సదురు నేత సిఫారసు చేసిన విద్యార్థులకే సీట్లు కేటాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం సాగిస్తూ జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ప్రభుత్వ ఐటీఐలోని కీలక అధికారి కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తున్నదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తూతూ మంత్రంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ డబ్బు కట్టిన విద్యార్థులకే సీట్లు ఓకే చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన ట్రేడ్లలో కూడా ఒక్కో సీటుకు రూ.8వేలు పైనే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఐటీఐ సీట్ల భర్తీలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు విమర్శలున్నాయి.
ఫ మెరిట్ విద్యార్థులకు మొండి చేయి:
విద్యా వ్యాపారం వల్ల మెరిట్ విద్యార్థులకు అందాల్సిన సాంకేతిక విద్య దూరమవుతున్నది. ప్రభుత్వ ఐటీఐలోని కీలక అధికారి మెరిట్ ప్రకారం విద్యార్థులకు సీట్లను కేటాయించకుండా.. అధికార పార్టీ నేతల సిఫారసు ఉన్న వారికే సీట్లను కేటాయించడం అన్యాయమని మెరిట్ విద్యార్థులు వాపోతున్నారు. గురువారం డోన ప్రభుత్వ ఐటీఐలో ఎంతో మంది మెరిట్ విద్యార్థులు కౌన్సిలింగ్‌కు వచ్చి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
ఫ సీట్లను అమ్ముతున్నారన్న ఆరోపణ నిజం కాదు - ప్రసాద్ రెడ్డి, ఐటీఐ ప్రిన్సిపాల్, డోన:
ప్రభుత్వ ఐటీఐలో సీట్లను డబ్బులకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు అవాస్తవం. ఐఎంసీ కింద సీటు పొందిన విద్యార్థులు రూ.15వేలు చెల్లించాల్సి ఉంటుంది. సిఫారసులు ఉన్న విద్యార్థులకే సీట్లు కేటాయిస్తున్నామన్న విమర్శల్లో నిజం లేదు. నిబంధనల ప్రకారమే సీట్లను భర్తీ చేశాం.