సాగునీటి ప్రాజెక్టులకు పూర్వవైభవం తెస్తా..

ABN , First Publish Date - 2023-08-02T00:03:28+05:30 IST

‘సైకో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది.

సాగునీటి ప్రాజెక్టులకు పూర్వవైభవం తెస్తా..

మిడ్తూరు ఎత్తిపోతలను పూర్తిచేస్తా..

శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగాలిస్తాం

బుడగజంగాలకు న్యాయం చేసి తీరుతాం

అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలందిస్తాం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

నందికొట్కూరు బహిరంగ సభలో చంద్రబాబు

నంద్యాల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి)/నందికొట్కూరు: ‘సైకో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది. కనీసం సాగునీటిని కూడా ఇవ్వలేకపోయిన జగన్‌ అసమర్థ సీఎంగా నిలిచిపోయాడు. ఆయన నాశనం చేసిన ప్రాజెక్టులన్నింటికీ పూర్వ వైభవం తీసుకొస్తా. కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రజలు, రైతులకు బాసటగా నిలుస్తా...’ అంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే సాగునీటి ప్రాజెక్టులకు పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో చంద్రబాబు నంద్యాల నందికొట్కూరు నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లా పాతపేట వరకు యాత్ర చేపట్టారు. అందులో భాగంగా ఆయన మంగళవారం నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల, బానకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని పటేల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమను నందమూరి తారకరామారావు సస్యశ్యామలం చేశారని, అదే పంథాను తాను కూడా కొనసాగించినట్లు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

నాలుగేళ్లలో సైకో సీఎం ఏం చేశాడు..?

వైసీపీ ప్రభుత్వం దోచుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధ రాయలసీమ అభివృద్ధిపైన కాని, సాగునీటి ప్రాజెక్టులపైన గాని చూపించడం లేదన్నారు. రాయలసీమలో పారే నీరంతా టీడీపీ తీసుకొచ్చింది నిజం కాదా? అని ప్రజలను ఉద్దేశించి ఆయన అన్నారు. రాష్ట్రంలోనే గోదావరి, మిగతా నదుల ద్వారా ఏటా 4 వేల టీఎంసీల నీరు వృఽథాగా సముద్రంలో కలుస్తోందని, వాటిని ఒడిసి పట్టి ప్రతి ఒక్క ఎకరాకు నీరందించాలని తాను కలలు కన్నానన్నారు. అందుకోసమే తాను 2014 నుంచి 2019 వరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.68 వేల కోట్లు ఖర్చు చేశానన్నారు. సైకో సీఎం జగన్‌ ఈ నాలుగున్నరేళ్లలో బూతులు మాట్లాడడం తప్పించి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలకు కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి తీవ్ర అన్యాయం చేశారన్నారు. తాను యాత్ర మొదలు పెట్టింది ప్రజల కోసమేనని జగన్‌ చేస్తున్న విధ్వంస పాలనను ప్రజలకు తెలియజేస్తూ వైసీపీని గద్దెదింపి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు.

హెచ్చుమీరిన దందాలు

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆకలిగొన్న రాబందుల్లా వైసీపీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో దందాలు చేశారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందికొట్కూరు సభలో ఆయన జగన్‌ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ‘ఒక్క అవకాశమంటూ ముద్దులు పెడుతూ జగన్‌ అడగగానే అధికారాన్ని ఆయన చేతిలో ప్రజలు ఉంచారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే జగన్‌ తన అసలు రంగు బయటపెట్టి ప్రజల వీపుల మీద గుద్దుతున్నాడు. ప్రజల సొమ్మును పక్కదారి పట్టిస్తూ జగన్‌ అండ్‌కో జేబులు నింపుకుంటోంది..’ అని చంద్రబాబు ఆరోపించారు. సైకో సీఎం జగన్‌ అలా ఉంటే.. నియోజకవర్గంలోని నాయకుల అరాచకం మరోరకంగా ఉందన్నారు. ప్రభుత్వ కాలనీలు వస్తాయని ముందే గ్రహించి రైతుల నుంచి రూ.5 లక్షలకు భూములు కొని అంతకు 12 రెట్లు అధిక ధరకు ప్రభుత్వానికి అమ్ముకున్నారన్నారు. ఈ లెక్కన ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇసుక, ఖనిజ దందా, మద్యం దందా అంటూ విచ్ఛల విడిగా ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారన్నారు. ఏపీలో చీప్‌ బ్రాండ్లను ప్రభుత్వ వైన్‌ షాపుల్లో అమ్ముతుండడంతో ప్రజలు తెలంగాణ మద్యానికి అలవాటు పడ్డారని, ఇదే అదునుగా తీసుకున్న ఇక్కడి నాయకులు తెలంగాణ మద్యాన్ని ఇక్కడికి తీసుకువచ్చి వ్యాపారాన్ని మొదలు పెట్టారన్నారు. ఇక్కడి ప్రజలకు ఇసుక దొరకడం గగనం అయిపోతుంటే... ఇక్కడి ఇసుకను బెంగళూరు, హైదరాబాదులకు తరలిస్తూ వైసీపీ నాయకులు కోట్లు దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

బాంబులు తీస్తే... తాటతీస్తా..!

‘ఇక్కడ ఒక అధికారపార్టీ నాయకుడు తానేదో గొప్పవాడిననే భ్రమలో ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యేను సైతం లెక్కచేయడం లేదు. అరచి రౌడీయిజం చేస్తూ బెదిరించాలని చూస్తే సహించేది లేదు. సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలి తప్ప రౌడీయిజం చేసేందుకు రాజకీయాలను ఎంచుకోకూడదన్నారు. అలా చేస్తే బెదిరేవారెవ్వరూ లేరు..’ అంటూ చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకుడు, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. రాయలసీమలో బాంబుల సంస్కృతి ఎప్పుడో అంతరించిపోయిందన్నారు. అయినా కూడా ముచ్చుమర్రిలో అధికారపార్టీ నాయకుడి ఇంట్లో బాంబులు దొరకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంకా బాంబులు చూపిస్తూ బెదిరిస్తే తాట తీస్తానన్నారు. యథా సీఎం... తఽథా నాయకుడు అన్నట్లు సైకో సీఎం జగన్‌ నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేస్తున్నాడన్నారు. వారంతా గంజాయి తాగుతూ రోడ్ల మీద తిరుగుతున్నారన్నారు. ఇలాంటి వారందరినీ ఇక్కడి మురుగు కాల్వలో పడేయాలన్నారు.

జాబు రావాలంటే... బాబు రావాలి

ఇక్కడ సభకు వచ్చిన యువతను చూస్తుంటే తన మీద వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్న కసి యువత కళ్లలో కనిపిస్తోందన్నారు. జగన్‌ మెగా డీఎస్సీ అన్నాడు.. జాబ్‌ క్యాలెండర్‌ అన్నాడు.. అవన్నీ నమ్మి ఓట్లు వేసిన యువతను నట్టేట ముంచాడన్నారు. వారందరికి టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన జగన్‌ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. అలాగే రైతు ప్రభుత్వం అని చెబుతూనే వారిని మోసం చేశారన్నారు. టీడీపీ అఽధికారంలోకి వస్తే ప్రజారంజక పాలన అందించడమే కాకుండా సూపర్‌ సిక్స్‌ పథకాలతో రైతు, యువత, మహిళా, బీసీ,ఎస్సీఎస్టీ వర్గాల వారికి పూర్తి న్యాయం చేస్తామన్నారు. అధిక ధర వెచ్చిస్తూ చీప్‌ మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చంద్రబాబు మందుబాబులను కోరారు.

నియోజక వర్గానికి బాబు భరోసా

నియోజకవర్గంలో సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భరోసా కల్పించారు. టీడీపీ అధికారంలోకి రాగానే నందికొట్కూరు ప్రధాన రహదారి కేజీ రోడ్డును నిర్మిస్తామన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మిడ్తూరు, పాములపాడు, నందికొట్కూరు మండలాలకు సాగునీరు అందించే మిడ్తూరు లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీశైలం నీటి ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని, అంతే కాకుండా నియోజకవర్గంలో అధికంగా ఉన్న బుడగ జంగాలకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అఖిలప్రియ, ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, కోట్ల సుజాత, బీసీ జనార్థన్‌రెడ్డి, మీనాక్షి నాయుడు, జయనాగేశ్వరరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ అధ్యక్షులు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గౌరు వెంకటరెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి, ఏపీ సీడ్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:03:28+05:30 IST