మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం - కలెక్టర్
ABN , First Publish Date - 2023-05-05T23:12:17+05:30 IST
జిల్లాలో మైనింగ్ మాఫియాను నియంత్రించేందుకు ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
నంద్యాల టౌన, మే 5 : జిల్లాలో మైనింగ్ మాఫియాను నియంత్రించేందుకు ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎస్పీ రఘువీర్‌రెడ్డితో కలిసి మైనింగ్ మండలాల రెవెన్యూ, పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాణ్యం, అవుకు, కొలిమిగుండ్ల, బనగానపల్లె, రుద్రవరం, మహానంది, డోన, బేతంచర్ల, నందికొట్కూరు, ఆత్మకూరుతో పాటు తదితర మండలాల్లో అక్రమ మైనింగ్‌లను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్‌పై ప్రతి రోజు వార్తా పత్రికల్లో ప్రతికూల వార్తలు వస్తున్న నేపథ్యంలో అనుమతులు తీసుకున్న లీజుదారులను మినహాయించి, అక్రమ మైనింగ్‌దారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై డివిజన, మండల స్థాయిలో పోలీసు, రెవెన్యూ అధికారులతో కమిటీ బృందాలు ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ స్పాట్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు తదితరులు తమ పరిధిలోని అక్రమ మైనింగ్‌పై సమాచారాన్ని సేకరించి సంబంధిత అధికారులకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ నిశాంతి, ఇనచార్జి డీఆర్వో కామేశ్వరరావు, మైనింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు.