మత్తు పదార్థాలను నియంత్రించాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2023-03-26T00:08:51+05:30 IST

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆదేశించారు.

మత్తు పదార్థాలను నియంత్రించాలి: ఎస్పీ
మాట్లాడుతున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి

నంద్యాల (నూనెపల్లె), మార్చి 25: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ టి. నిశాంతితో కలిసి శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లా కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదార్థాల నియంత్రణకై కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. వ్యవసాయ, అటవీశాఖలు తమ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో అక్రమంగా గంజాయి సాగును సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో గుర్తించి, గంజాయిని పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు. మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులను గుర్తించి డీ అడిక్ట్‌ సెంటర్లలో వైద్యసేవలు ఇచ్చి కౌన్సిలింగ్‌ నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. తూర్పు ఏజన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గంజాయి, డ్రగ్స్‌పై నిఘా ఉంచి నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీలను ఆదేశించారు. ఎక్కువ సార్లు మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి జిల్లా నుంచి బహిష్కరించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రమణ, డీఆర్వో పుల్లయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, సర్వజన వైద్యశాఖ సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ ప్రసాదరావు, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ జఫ్రూల్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:08:51+05:30 IST