పాఠ్యపుస్తకాల తరలింపుపై విచారణ
ABN , First Publish Date - 2023-06-26T00:34:05+05:30 IST
ఆత్మకూరు పట్టణంలో శనివారం రాత్రి పాత పాఠ్యపుస్తకాల తరలింపుపై తలెత్తిన దుమారం నేపథ్యంలో ఆదివారం నంద్యాల డిప్యూటీ డీఈవో మహెబూబ్ బేగ్ విచారణ చేపట్టారు.
ఆత్మకూరు, జూన్ 25: ఆత్మకూరు పట్టణంలో శనివారం రాత్రి పాత పాఠ్యపుస్తకాల తరలింపుపై తలెత్తిన దుమారం నేపథ్యంలో ఆదివారం నంద్యాల డిప్యూటీ డీఈవో మహెబూబ్ బేగ్ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆత్మకూరు ఎంఈవో జానకీరామ్ విచారించి వివరాలు సేకరించారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మంజూరైన పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, ఇతర సామగ్రిని నిల్వ వుంచేందుకు ఆత్మకూరు ఎమ్మార్సీ కేంద్రంలో అనువైన గదులు లేకపోవడంతో నంద్యాల రస్తాలోని జిల్లా పరిషత్ ఉర్ధూ పాఠశాలలో గల స్టాక్ పాయింట్‌లో నిల్వ ఉంచినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఇటీవల ఎంఈవో-2 పోస్టు నియామకం జరగడంతో ఎమార్సీ భవనంలో ఆయన ఛాంబర్ ఏర్పాటుకై చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మార్సీలోని ఓగదిలో వృధాగా వున్న సిలబస్ గడిచిన మూడేళ్ల నాటి పాత పాఠ్యపుస్తకాలకు చెదలు పట్టి తేల్లు, పాములు వస్తుండటంతో భయాందోళనకు గురవుతుండటంతో పాతపాఠ్యపుస్తకాలను జడ్పీఉర్ధూ ఉన్నత పాఠశాల స్టాక్ పాయింట్ వద్దకు తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. అయితే దీనిపై కొందరు లేనిపోని అసత్య ప్రచారాలు చేశారని, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని ఎంఈవో తన విచరణ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం డిప్యూటీ డీఈవో మహెబూబ్ బేగ్ ఆత్మకూరు ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది వివరణ కూడా తీసుకున్నట్లు తెలిసింది. అంతకుముందు ఆయన స్టాక్ పాయింట్‌లో పాఠ్యపుస్తకాల నిల్వలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.