సీమ కళాకారులకు అన్యాయం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:51 AM
సుమారు ఐదేళ్ల తర్వాత ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నంది నాటక పోటీల్లో సీమ కళాకారులకు అన్యాయం జరిగిందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, సీనియర్ రంగస్థల దర్శకుడు పత్తి ఓబులయ్య అన్నారు.
విజేతల ఎంపికలో ఏకపక్షంగా నిర్ణయాలు
నాటక దర్శకుడు పత్తి ఓబులయ్య
కర్నూలు(కల్చరల్), డిసెంబరు 30: సుమారు ఐదేళ్ల తర్వాత ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నంది నాటక పోటీల్లో సీమ కళాకారులకు అన్యాయం జరిగిందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, సీనియర్ రంగస్థల దర్శకుడు పత్తి ఓబులయ్య అన్నారు. శనివారం నగరంలోని టీజీవీ కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతోపాటూ నంది పోటీల్లో పాల్గొన్న గాండ్ల లక్ష్మన్న, ఎల్ లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లాడుతూ పద్య నాటకాల బహుమతుల ఎంపికలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఒకే కులానికి చెందిన వారికి అవార్డులు ఇచ్చారని అన్నారు. పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు, తెరమరుగవుతున్న ఈ నాటకాలకు పునరుజ్జీవం కల్పించేందుకు 1998లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంది నాటక పరిషత్తును ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే పౌరాణిక పద్య నాటకాల విభాగంలో ఇవ్వాల్సిన బహుమతులను చారిత్రక నాటకాలకు కేటాయించారని చెప్పారు. కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి కళాకారులు నాటకాలను ప్రదర్శించగా, కోస్తాంధ్రకు తొలి ప్రాధాన్యత ఇచ్చారని, ప్రధాన బహుమతులన్నీ ఆ ప్రాంతం వారికి, ఒకే కులం వారి ఇచ్చి, తృతీయ స్థానంలో తెలంగాణ వారికి, ఎలాంటి ప్రాధాన్యత లేనివి సీమ వారికి ప్రకటించారని అన్నారు. పద్య నాటకాల్లో అనుభవం లేని న్యాయ నిర్ణేతలను నియమించడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. పోటీల్లో వచ్చిన బహుమతుల తిరస్కరణ సమయంలో సమాధానం చెప్పాల్సిన న్యాయనిర్ణేతలు, చైర్మన్ పోసాని కృష్ణమురళి మౌనం వహించడంలో అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నంది బహుమతుల్లో ఇచ్చే పారితోషికాల కన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి తాము నాటకాలు ప్రదర్శించామని, అక్కడి ప్రేక్షకుల ఆదరాభిమానాలే అందుకు నిదర్శనమని అన్నారు. ఆహార్యం, స్టేజ్ లైటింగ్ అనే అప్రాధాన్యమైన బహుమతులు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఒక్కటే అన్న భావనతో వాటిని తిరస్కరించినట్లు పత్తి ఓబులయ్య వివరించారు.