వందగల్లులో హైటెన్షన్!
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:58 PM
కోసిగి మండలంలోని వందగల్లులో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పదో తరగతి విద్యార్థిని అదృశ్యం
పాఠశాల పీఈటీపై దాడి చేసిన గ్రామస్థులు
కోసిగి, డిసెంబరు 22: కోసిగి మండలంలోని వందగల్లులో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆ విద్యార్థినీ ఆచూకి కోసం గాలించారు. ఎక్కడా తమ కూతురు కనిపించకపోవడంతో ఆ పాఠశాలలో పని చేస్తున్న పీఈటీ చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై దాడి చేయాలని గ్రామస్థులు భావించారు. దాడి జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం గ్రామానికి వెళ్లి పీఈటీని తీసుకువస్తుండగా విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు దాదాపు 200 మందికి పైగా గ్రామస్థులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు చూస్తుండగానే పీఈటీపై దాడికి పాల్పడ్డారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న మరికొందరు ఉపాధ్యాయులు గ్రామస్థుల ఆగ్రహాన్ని చూసి భయాందోళనకు గురై చేతులెత్తి మొక్కుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. చివరకు పోలీసులు సదరు పీఈటీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్పటికీ శాంతించని గ్రామస్థులు కోసిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కడపలో ముఖ్యమంత్రి బందోబస్తుకు కోసిగి ఎస్‌ఐ వెళ్లడంతో కౌతాళం ఎస్‌ఐ టి.నరేంద్ర కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శనివారం పూర్తి వివరాలు తెలియజేస్తామని అని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.