ప్రభుత్వం దిగిరావాల్సిందే...
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:12 AM
ప్రభుత్వం దిగిరావాల్సిందే...
12వ రోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె
కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 23: రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు చేపడుతున్న సమ్మె శనివారం 12వ రోజుకు చేరుకుంది. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల ధర్నా చౌక్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనను చూడలేక కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం కూడా చలన రాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్ల, కార్పొరేటర్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 26 నుంచి అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్.నరసింహులు, ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్, సీఐటీయూ పి.నిర్మలమ్మ, నాయకులు అంజిబాబు, వీరశేఖర్, సుందరయ్య, జేఎన్ శేషయ్య, ఎస్.మునెప్ప, టి.రాముడు, ఎం.రాజశేఖర్, ఐద్వా కె.అరుణ తదితరులు పాల్గొన్నారు.