సమరమే..!

ABN , First Publish Date - 2023-02-28T00:19:35+05:30 IST

సమరమే..!

సమరమే..!

‘స్థానిక’ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు

ఏకగ్రీవానికి వైసీపీ చేసిన యత్నాలు ఫలించని వైనం

పట్టు వదలని స్వతంత్రులు

ముగ్గురు పోటీలో ఉన్నట్టు జేసీ ప్రకటన

అధికార పార్టీకి క్రాస్‌ ఓటింగ్‌ భయం

నేటి నుంచి కదలనున్న ప్రచార రథ చక్రాలు

మంత్రులు జిల్లాలో మకాం వేశారు. శాసన సభ్యులు వ్యూహాలు రచించారు. పోలీసులను రంగంలోకి దించారు. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించారు. ఎక్కడెక్కడో వెదికారు. బంధువులు..కుటుంబ సభ్యుల ఇళ్ల చుట్టూ నిఘా పెంచారు. కానీ ఒక్క ప్రయత్నమూ ఫలించలేదు. అధికార వైసీపీ నేతలు పెట్టుకున్న ‘ఏకగ్రీవ’ లక్ష్యం నెరవేరలేదు...ఇదీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కథ. ఏకగ్రీవం కోసం చివరి క్షణం వరకూ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. బరిలో ముగ్గురు మిగిలారు. పోటీ అనివార్యమైంది. వైసీపీ నాయకులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి...ఏకగ్రీవం చేసుకోవాలని యత్నించిన వైసీపీ ఆశలపై స్వతంత్ర అభ్యర్థులు నీళ్లు చల్లారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిల వ్యూహాలు బెడిసికొట్టాయి. స్వతంత్ర అభ్యర్థులు భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డి, నర్ల మోహన్‌రెడ్డిలు సమరానికి సై అనడంతో త్రిముఖ పోరు అనివార్యమైంది. అధికార పార్టీకే గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా.. క్రాస్‌ ఓటింగ్‌ భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా.. సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని రిటర్నింగ్‌ అధికారి, జేసీ రామసుందర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఫలించని వైసీపీ ఎత్తులు

ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ పోరుకు దూరంగా ఉంటుందని ముందే ప్రకటించింది. దీంతో ఏకగ్రీవం ఖాయమని వైసీపీ నాయకులు భావించారు. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ ఈ నెల 23న నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ తరువాత టీడీపీ మద్దతుతో ఏపీ సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు, బేతంచర్ల మండలం అంబాపురం సర్పంచి కె.శ్రీనివాసులు యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు, ఓర్వకల్లు మండలం గుట్టపాడు సర్పంచి ఎన్‌.మోహన్‌రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘ రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం మోత్కులపల్లి సర్పంచి భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డిలు సాధారణ వ్యక్తుల్లా ఒక్కొక్కరుగా రిటర్నింగ్‌ అధికారి, జేసీ రామ సుందర్‌రెడ్డి చాంబర్‌కు చేరుకున్నారు. నామినేషన్లు పత్రాలు అందజేశారు. ఇది మింగుడు పడని వైసీపీ అధిష్టానం ఏకగ్రీవం కోసం వ్యూహ రచన చేసింది. జగన్‌ ప్రభుత్వంలో నెంబరు-2గా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సొంత మండలం బేతంచర్ల నుంచే పోటీ ఎదురైంది. దీంతో ఆయన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ప్రతిపాదించిన ఇద్దరు కౌన్సిలర్ల ద్వారా ఫోర్జరీ సంతకాలని ఫిర్యాదు చేసేలా చేయడంతో కె.శ్రీనివాసులు నామినేషన్‌ ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురైంది. మరో ఇద్దరు స్వతంత్రుల నామినేషన్లను ఆర్‌ఓ ఆమోదించారు. ఎలాగైనా వారిద్దరిని విత్‌ డ్రా చేయించి... ఏకగ్రీవం చేసుకోవడానికి రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల వైసీపీ సమన్వయకర్తలు కడప జిల్లాకు చెందిన జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డిలు రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఎత్తులు వేశారు. దీన్ని ముందే ఉహించిన స్వతంత్ర అభ్యర్థులు సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉపసంహరణకు సోమవారం సాయంత్రం 3 గంటలతో గడువు ముగిసింది. దీంతో వైసీసీ అభ్యర్థి డాక్టర్‌ ఎ.మధుసూదన్‌, స్వతంత్ర అభ్యర్థులు భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డి, ఎన్‌ మోహన్‌రెడ్డిలు పోటీలో ఉన్నారని రిటర్నింగ్‌ అధికారి, జేసీ రామసుందర్‌రెడ్డి ప్రకటించారు.

క్రాస్‌ ఓటింగ్‌ భయం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం ఓట్లు 1,178 ఉంటే.. వైసీపీ గుర్తుపై పోటీ చేసిన గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు 1,022 మందికి పైగానే ఉన్నారు. వీరిలో ఎంపీటీసీ సభ్యులే 807 మంది ఉన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల మధ్య రాజకీయ అనుబంధం బలంగా ఉంటుంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. పల్లెసీమల అభివృద్ధిని నిర్వీర్యం చేసిందనే ఆగ్రహంతో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. అంతేకాదు.. ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చు చేసి గెలిస్తే అభివృద్ధి కనిపించకపోవడమే కాక పైసా ఆదాయం లేకుండాపోయింది. దీంతో సర్పంచులు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో అదేస్థాయిలో గళం వినిపించాలని ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో టీడీపీ మద్దతుతో సర్పంచులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. నిధుల విషయంలో వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకత క్రాస్‌ ఓటింగ్‌గా మారితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు గెలవకపోయినా.. 350-400 పైచిలుకు ఓట్లు సాధించినా నైతిక విజయం వారిదే అవుతుందని వైసీపీ నాయకులను వేధిస్తున్న భయం. అధికారి పార్టీ నాయకుల ఒత్తిళ్లు, బెదిరింపులు, బుజ్జగింపులకు తలొగ్గకుండా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు భూమా వేణుగోపాల్‌రెడ్డి. నర్ల మోహన్‌రెడ్డిలు ఏమేరకు వైసీపీ ఓట్లు చీలుస్తారో వేచి చూడాలి.

పోటీనే కోరుకున్న వైసీపీ ప్రజాప్రతినిధులు

స్వతంత్ర అభ్యర్థులను విత్‌డ్రా చేయించి... ఏకగ్రీవం కోసం ఓ వైపు వైసీపీ ముఖ్య నాయకులు ప్రయత్నాలు చేస్తే.. పోటీ ఉండాలని అదే పార్టీకి చెందిన పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు అభిప్రాయపడడం గమనార్హం. 2016లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి (ప్రస్తుతం శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే), వైసీపీ అభ్యర్థిగా గౌరు వెంకటరెడ్డి (ప్రస్తుతం టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు) పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న జడ్పీటీసీ. ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు డిమాండ్‌ను బట్టి ఓటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పంపిణీ చేశారు. పోలింగ్‌ ముందు రోజు రాత్రి, పోలింగ్‌ రోజు క్రాస్‌ ఓటింగ్‌ వేస్తామని వచ్చిన వారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలింగ్‌ ముగిసే వరకు పోటా పోటీగా సమావేశాలు, డిన్నర్లు, విహార యాత్రలు నడిపించారు. ఏకగ్రీవమైతే ఒక్క పైసా కూడా ఇవ్వరు. పోటీ ఉంటే అంతో ఇంతో డబ్బులు ఇస్తారు.. ఎన్నికల్లో చేసిన ఖర్చు కొంతైనా చేతికి వస్తుందని కొందరు ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2023-02-28T00:19:45+05:30 IST