గండం గట్టెక్కేదెలా..?

ABN , First Publish Date - 2023-03-25T23:24:42+05:30 IST

కర్నూలు నగర జనాభా 6 లక్షల పైమాటే.. రోజుకు 87 మిలియన్‌ లీటర్లు తాగునీరు అవసరం.

   గండం గట్టెక్కేదెలా..?

పొంచి ఉన్న తాగు నీటి ముప్పు

ఎస్‌ఎ్‌స ట్యాంకులో నెలకు సరిపడా నీరే..

సుంకేసుల రిజర్వాయర్‌లోనూ ఇదే పరిస్థితి

మే ఆఖరి వరకు కూడా సరిపోవంటున్న ఇంజనీర్లు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే నగరవాసులకు కష్టాలే

కర్నూలు(న్యూసిటీ), మార్చి 25: కర్నూలు నగర జనాభా 6 లక్షల పైమాటే.. రోజుకు 87 మిలియన్‌ లీటర్లు తాగునీరు అవసరం. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నీటి సామర్థ్యం 0.16 టీఎంసీ(4410 మిలియన లీటర్లు)లు. అయితే ప్రస్తుతం ఉన్నది 3,856 మిలియన్‌ లీటర్లే. సుంకేసుల బ్యారేజీలోనూ ఇదే పరిస్థితి. అంటే.. రెండు నెలలు కూడా సరిపోవు. ఆ తర్వాత దాహం తీర్చేది ఎలా..? ముందస్తు చర్యలు చేపట్టకపోతే ఏప్రిల్‌ నుంచే నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. తుంగభద్ర డ్యాం నుంచి సుంకేసుల జలాశయానికి రావాల్సిన మూడు టీఎంసీల తాగునీటిని విడుదల చేయకపోతే నీటి ముప్పు తప్పదు. ప్రజాప్రతినిధులు మేల్కొని ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

కర్నూలు నగరంలో 1.20 లక్షల నివాసాలు ఉన్నాయి. 52 వార్డుల్లో 6లక్షలకు పైగా జనాభా ఉంది. ప్రజల దాహం తీర్చేందుకు ప్రధాన ఆధారం సుంకేసుల జలాశయంతో పాటు మునగాలపాడు సమీపంలో నిర్మించిన ఎస్‌ఎస్‌ ట్యాంకే. ఆయా జలాశయాల్లో నీటి నిల్వలు పరిశీలించిన నగర పాలక ఇంజనీర్లు వేసవి అంతా రావడం కష్టమేనని చెబుతున్నారు. ఇప్పటికే శివారు కాలనీలు గణే్‌ష నగర్‌, ధనలక్ష్మీనగర్‌, షరీన్‌నగర్‌, కృష్ణానగర్‌, లేబర్‌ కాలనీలతోపాటు నగరంలో విలీనమైన స్టాంటన్‌పురం, మునగాలపాడు, మామిదాలపాడు, తదితర ప్రాంతాల్లో రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అది కూడా గంటకు మించి ఇవ్వడం లేదు. బిందెడు నీరు దొరికితే చాలు మహాప్రభో.. దాహం తీర్చుకుంటాం అంటూ ఆయా కాలనీవాసులు వేడుకుంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, డబ్బు ఉన్న బడాబాబులు ఆర్వో ప్లాంట్‌ నుంచి శుద్ధి చేసిన నీటి ట్యాంక్‌ను కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. రెక్కాడితే డొక్కాడని పేదలు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి సగటు జీవికి కుళాయి నీరే ఆధారం. ప్రస్తుతం జలాశయంలో అడుగంటిపోతున్న నీటి నిల్వలు చూసి వేసవిలో దాహం తీరేది ఎలా అని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

పుష్కలంగా ఎస్‌ఎస్‌ ట్యాంక్‌

నగర వాసులకు దాహం తీర్చే ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 0.16 టీఎంసీలు. ప్రస్తుతం 0.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం నగరంలో ప్రతి వ్యక్తికి రోజు 125 లీటర్ల చొప్పున 87 మిలియన్‌ లీటర్లు సరఫరా చేస్తున్నామని ఇంజనీర్లు అంటున్నారు. వాస్తవంగా 97 మిలియన్‌ లీటర్లు ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన ఎస్‌ఎస్‌ ట్యాంకులో నిల్వ ఉన్న నీరు సరాసరి 60 రోజులకు మించి సరిపోదని నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు చెబుతున్నారు. అలాగే సుంకేసుల జలాశయంలో ప్రస్తుతం 0.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో డెడ్‌ స్టోరేజి, వేసవి నీటి ఆవిరి, కేసీ కాల్వకు విడుదల చేసే సమయానికి సిస్టమ్‌ లాస్‌ కలుపుకొని 3-4వేల మిలియన్‌ లీటర్లకు మించి వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. అంటే ఇటు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌, అటూ సుంకేసుల జలాశయంలో నిల్వ ఉన్న నీరు సరాసరి 65 నుంచి 70 రోజులకు మించి సరిపోదు. ఈ లెక్కన మే 15వ తేదీకి మించి నీటిని ఇవ్వలేని పరిస్థితి. దీంతో మే 15 తర్వాత నగర వాసులకు దాహం తీర్చే ప్రత్యామ్నాయ మార్గం ఏంటన్నదే ఇప్పుడు అర్థంగాని ప్రశ్న.

ఈ ప్రత్యామ్నాయ చర్చలు తీసుకోకపోతే:

ఫ నగర వాసుల దాహం తీర్చాలంటే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకరావడం ఓ ప్రత్యామ్నాయ మార్గం. అయితే.. ఆ జలాశయంలో నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం 1.00 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో డెడ్‌ స్టోరేజీ పోగా 0.40 టీఎంసీలకు మించి వినియోగించుకోవడానికి వీలు లేదని ఇరిగేషన్‌ ఇంజనీర్లు అంటున్నారు. ఆ నీటిలో ప్రస్తుతం ఆ డ్యాం కింద సాగులో ఉన్న పంటలను కాపాడాలంటే 0.40 టీఎంసీలు, ఈ డ్యాంకు అనుసంధానంగా నిర్మించిన బండకట్టు రక్షిత మంచినీటి పథకం పరిధిలోని గ్రామాలు, పత్తికొండ, కృష్ణగిరి, డోన్‌, కోడుమూరు పట్టణాలకు తాగునీరు అందించేందుకు 0.5 టీఎంసీలు అవసరమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టులో ఉన్న నీటి నుంచి ఒక్క లీటర్‌ కూడా నగరానికి తీసుకోవడానికి అవకాశం లేదు. అయితే.. పందికోన రిజర్వాయర్‌ నుంచి హంద్రీనీవా కాల్వ నీటిని కనీసం ఒక టీఎంసీ నీటినైనా గాజులదిన్నెకు విడుదల చేస్తే కనీసం 0.50 టీఎంసీలు జీడీపీకి చేరుతుంది. అక్కడ నుంచి దేవమ్మ మడుగుకు నీటిని మళ్లించి పంపుల ద్వారా ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు మళ్లిస్తే వేసవిలో కొంతవరకైనా దాహం తీర్చే అవకాశం ఉంది. ఈ ప్రత్యామ్నాయం దిశగా అధికారులు ఆలోచించాలి.

తాగునీటికి ఇబ్బంది లేదు -ఎ.భార్గవతేజ, కమిషనర్‌, నగర పాలక సంస్థ కర్నూలు

జూన వరకు నగరంలో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఎస్‌ఎ్‌స ట్యాంకు, సుంకేసుల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల సుంకేసుల రిజర్వాయర్‌ను పరిశీలించాను. ప్రస్తుతం కేసీ కెనాల్‌కు నీటి సరఫరా జరుగుతోంది. ఒకవేళ కేసి కెనాల్‌కు నీటి సరఫరా ఆగిపోతే నగరానికి సంబంధించి తాగునీటి కోసం ప్రత్యామ్నాయంగా గాజులదిన్నె నుంచి తెచ్చుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశాం. అయితే గత మూడు సంవత్సరాలుగా వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాలేదని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఎస్‌ఎ్‌స ట్యాంకు, సుంకేసుల, గాజులదిన్నెలో నీరు పుష్కలంగా ఉంది.

Updated Date - 2023-03-25T23:24:42+05:30 IST