నియంతపై పోరాటం
ABN , First Publish Date - 2023-10-04T00:37:34+05:30 IST
నియంతపై పోరాటం
చంద్రబాబు అక్రమ అరెస్టుపై
కొనసాగుతున్న దీక్షలు
మంత్రాలయంలో గర్జించిన వాల్మీకులు
నిరసనలో భాగస్వాములైన స్థానిక ప్రజాప్రతినిధులు
కర్నూలు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం 21వ రోజు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రిలే దీక్షలు కొనసాగించారు. ‘బాబుతో నేను’, ’ఓ నియంత సాగిస్తున్న అరాచకంపై పోరాటానికి మేము సైతం’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది..అని నాయకులు అన్నారు. కర్నూలు నగరం శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ ధర్నా చౌక్ వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలను టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుకు నిరనసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు, దీక్షలు చేస్తోంటే వైసీపీ వాళ్లు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ అనుకూల ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్ పరమేశ్, తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు హాజరు అయ్యారు. కోడుమూరులో టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వడ్డెర సామాజికవర్గానికి చెందిన నాయకులు దీక్షలో కూర్చున్నారు. మాజీ సర్పంచుల సీబీ లత, కేఈ రాంబాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జునగౌడ్ సంఘీభావం తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణం మాచాని సోమప్ప సర్కిల్‌లో రిలే దీక్షలను టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. గోనెగండ్ల మండలం బైలుప్పుల, కులమాల, నందవరం చిన్నకొత్తిలికి, ఎమ్మిగనూరు మండలం నాగులాపురం, కడిమెట్ల గ్రామాల నాయకులు దీక్షలో కూర్చున్నారు. టీడీపీ నాయకులు కొండయ్య చౌదరి, తురేగల్లు నజీర్, సుందరరాజు, రామదాస్‌గౌడ్, దయాసాగర్, దేవిబెట్ల సోమశేఖర్, రంగస్వామిగౌడ్ పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి పి.తిక్కారెడ్డి నాయకత్వంలో వేలాదిగా తరలివచ్చిన వాల్మీకులు భారీ ఊరేగింపు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్‌రెడ్డి, తెలుగురైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రమాకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదోనిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతినాయుడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. టీడీపీ ఎస్టీ సెల్ విభాగం నాయకులు మాజీ కౌన్సిలర్ నరసింహులు, మహాదేవ, ఉరుకుందు, కేశవ్ దీక్షలో కూర్చున్నారు. ఓ ఆరాచకశక్తి చేతిలో రాజ్యాంగం విలవిల లాడుతున్నదని, చివరికి సత్యమే గెలుస్తుందని మీనాక్షినాయుడు పేర్కొన్నారు. ఆలూరు బస్టాండు సర్కిల్‌లో రిలే దీక్షలను టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ప్రారంభించారు. ఆలూరు సర్పంచి అరుణాదేవి, మొలగవెళ్లి సర్పంచి మోహన్‌రాజు, మరకట్టు సర్పంచి ఎల్లప్ప, ఎం.కొట్టాల సర్పంచి రాజు, అర్ధగేరి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీవిద్యారెడ్డి సహా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు దీక్షలో కూర్చున్నారు. పత్తికొండ నాలుగు స్తంభాల కూడలి వద్ద ఆ పార్టీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు పత్తికొండ మండలం పందికోన గ్రామానికి చెందిన 50 మంది ప్రజలు దీక్షలో కూర్చున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, బీసీ సెల జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిరసన తెలిపారు. పాణ్యంలో రిలే దీక్షలను టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ ప్రారంభించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఒంటికాలిపై నిరసన తెలిపారు.