Share News

రైతులను ఆదుకోవడంలో విఫలం

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:54 PM

కరువు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు.

రైతులను ఆదుకోవడంలో విఫలం

కరువు, వరదలతో నష్టపోయిన రైతులను పట్టించుకోని సీఎం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

ఎమ్మిగనూరులో ఏపీ రైతు సంఘం జిల్లా మహాసభలు ప్రారంభం

ఎమ్మిగనూరు రూరల్‌, డిసెంబరు 18: కరువు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీ రైతు సంఘం 10 జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక పంచాయతీరాజ్‌ కార్యాలయ ఆవరణ నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప సర్కిల్‌లో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పంపన్నగౌడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు సరిగా కురవకపోవడంతో దాదాపు 30 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయలేదన్నారు. ‘జగన్‌... నీ అహంకారంతోనే మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారు..’ అని రామకృష్ణ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమి అధికారాలు ఇచ్చావని జగన్‌ను ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే కదా అన్నారు. వైనాట్‌ 175 అంటున్నావని.. అలాంటప్పుడు రాష్ట్రంలో 82 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల స్థానాలను ఎందుకు మారుస్తున్నావని ప్రశ్నించారు.. ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో అహంకారి కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఇంటికి పంపారని..ఇక్కడ కూడా దురహంకారి సీఎం జగన్‌ను ఇంటికి సాగనంపాలని ప్రజలను కోరారు. అనంతరం ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌, రామచంద్రయ్య మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కరువు పరిశీలన బృందం పర్యటించి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులను ఆదుకొనే చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ సభలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీరెడ్డి, జగన్నాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:54 PM