కబ్జాకోరులెవరో ప్రజలకు తెలుసు

ABN , First Publish Date - 2023-05-24T00:15:26+05:30 IST

కబ్జాకోరులు ఎవరో ప్రజలకు తెలుసు అని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై ఘాటుగా విమర్శించారు.

కబ్జాకోరులెవరో ప్రజలకు తెలుసు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, మే 23: కబ్జాకోరులు ఎవరో ప్రజలకు తెలుసు అని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై ఘాటుగా విమర్శించారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై లోకేశ్‌ మాట్లాడారని, అయితే ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.. చంద్రబాబు, నారా లోకేశ్‌, తనపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని అన్నారు. కాటసానికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే అని అన్నారు. యువగళం పాదయాత్రతో సీఎం జగన్‌కు, వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడారని, దీనికైనా సమాధానం చెప్పాలని అన్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ మెటీరియల్‌లో రూ.10 కోట్లు జరిమానా విధించగా కాటసాని జనసేన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి మాఫీ చేయించుకున్నారన్నారు. సర్వేనంబర్లు మార్పించి ఎమ్మెల్యే తన కొడుకుపేరుతో తహసీల్దారు సంతకాలు లేకుండా రాత్రికి రాత్రే రెవెన్యూ రికార్డులు మార్చి భూములు కబ్జా చేయలేదా? ప్రశ్నించారు. కార్యకర్తలనుంచి కమీషన్లు తీసుకునేది ఎవరో వైసీపీ కార్యకర్తలను అడిగితే చెబుతారన్నారు. కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌కు 500 ఎకరాలు ఇచ్చి సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చంద్రబాబు సహకరించారన్నారు. యనకండ్ల సిమెంట్‌ ఫ్యాక్టరీకి కావాల్సినంత లీజులున్నా, యనకండ్ల, యర్రగుడికి చెందిన కొండను ఆక్రమించి వారిపశువులకు పశుగ్రాసంలేకుండా చేశారన్నారు. బనగానపల్లెలో ఇళ్ల పట్టాలకు డబ్బులు వసూలు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎస్సార్బీసీ బఫర్‌జోన్‌ తీసివేసి మిగతా పొలం పట్టాలు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. బనగానపల్లెలో షాదీఖానాకు సంబంధించి రూ.30లక్షలు తాను విరాళం ఇచ్చి 60 శాతం పనులు పూర్తి చేశామన్నారు. త్వరలో షాదీఖానా పనులు పూర్తి చేస్తామని బీసీ తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి, బనగానపల్లె పట్టణ అధ్యక్షుడు కాశీంబాబు, కొలిమిగుండ్ల మండల అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, వీఆర్‌ లక్ష్మిరెడ్డి, బనగానపల్లె పట్టణ ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, గోపాల్‌రెడ్డి, పాతపాడు సర్పంచ్‌ మహేశ్వరరెడ్డి, కలాం, చంద్రమౌళీశ్వరరెడ్డి, కైప రఘునాథరెడ్డి, అల్తాఫ్‌ హుస్సేన్‌, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి తదితులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-24T00:15:26+05:30 IST